ఖమ్మంలో బయటపడుతున్న వర్గపోరు..అవిశ్వాసానికి స్కెచ్​!

  • బయటపడుతున్న వర్గపోరు..  అవిశ్వాసానికి స్కెచ్​!
  • పావులు కదుపుతున్న కౌన్సిలర్లు
  • కొత్తగూడెం, ఇల్లెందు లో రగులుతున్న మున్సిపాలిటీ రాజకీయాలు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలలో అధికార టీఆర్​ఎస్​ కౌన్సిలర్లు అవిశ్వాసానికి స్కెచ్​ వేస్తున్నరు. రెండు మున్సిపాలిటీలలో టీఆర్​ఎస్​ లీడర్ల మధ్య వర్గపోరు నడుస్తోంది. చైర్మన్లు, వైస్​ చైర్మన్ల మధ్య విబేధాలు పెరుగుతున్నాయి చైర్మన్​పై అవిశ్వాసం పెట్టేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు పావులు కదుపుతున్నారు.

కౌన్సిలర్లు వర్సెస్​ చైర్మన్లు

జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీలున్నాయి. మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేవు. ఆయా మున్సిపాలిటీలలో ఎన్నికలపై కోర్టులో కేసు నడుస్తోంది. ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీలను టీఆర్​ఎస్ కైవసం చేసుకుంది. కొత్తగూడెం మున్సిపాలిటీ చైర్​ పర్సన్​గా కాపు సీతాలక్ష్మి, ఇల్లెందు మున్సిపల్​ చైర్మన్​గా దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇదిలా ఉండగా కొంత కాలంగా టీఆర్​ఎస్​ లీడర్ల మధ్య రగడ కొనసాగుతోంది. రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, పలువురు కౌన్సిలర్ల మధ్య పంచాయితీ నడుస్తోంది. చైర్మన్ల తీరుపై సొంతపార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేయాలని చూస్తున్నారు. 2023 జనవరి నాటికి పాలకవర్గం అధికారం చేపట్టి మూడేండ్లు కానుండడంతో అవిశ్వాసం అవిశ్వాసాన్ని ప్రతిపాదించేందుకు సిద్ధ పడుతున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో అధికార టీఆర్​ఎస్​ పార్టీ చైర్​ పర్సన్​పై సై అంటే సై అంటూ ఆ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు తిరుగుబాటు చేస్తున్నారు. కొత్తగూడెం వైస్​ చైర్మన్​ దామోదర్​ తిరుగుబాటు వర్గంలో కొనసాగుతున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్​పై వైస్​ చైర్మన్​ జానీ పాషా ఆధ్వర్యంలో సీఎంతో పాటు మున్సిపాలిటీ మినిస్టర్, హెచ్ఆర్​సీకి కంప్లైట్​ ఇచ్చారు. అధికారం కోసమే కొందరు కావాలని తనపై కుట్రలు పన్నుతున్నారని ఇల్లెందు చైర్మన్​ అంటున్నారు. 

నల్ల కండువాలతో నిరసన.. 

 ఇల్లెందు మున్సిపాలిటీ ఆఫీస్​ ఎదుట టీఆర్​ఎస్​ కౌన్సిలర్లు మంగళవారం నల్ల కండువాలు ధరించి నిరసన తెలపడంతో విభేదాలు మరింతగా రచ్చకెక్కాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో నెలకొన్న విభేదాలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇరు పక్షాలతో నాలుగు రోజుల కిందట క్యాంప్​ ఆఫీస్​లో రహస్య చర్చలు సాగించారు. పార్టీలో వర్గాలు లేవు, అంతా ఎమ్మెల్యే వర్గమే అంటూ సంతకాలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోసమే తాము సంతకాలు చేశామని చైర్మన్​ వర్గంతో పాటు తిరుగుబాటు వర్గం నేతలు అంటున్నారు. చైర్మన్​ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నందువల్లే తాము అవిశ్వాసం దిశగా ప్లాన్​ చేస్తున్నామని వ్యతిరేక వర్గానికి చెందిన కౌన్సిలర్లు చెప్తున్నారు.

పట్టించుకోని అధిష్టానం ..

కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలలో అధికార టీఆర్​ఎస్​ పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నప్పటికీ అధిష్టానం పెద్దగా పట్టించుకోనట్టే ఉంది. దీంతో వర్గపోరు రోజురోజుకు తీవ్ర మవుతుందని ఆ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు.

అవిశ్వాసం పెడితే?

 ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులకు గానూ 22 మంది కౌన్సిలర్లు టీఆర్​ఎస్​ వాళ్లు కాగా ఇందులో 11 మంది చైర్మన్​ వర్గంగా, మరో 11 మంది వైస్​ చైర్మన్​ వర్గంగా ఉన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లకు గానూ ఎనిమిది మంది సీపీఐ కౌన్సిలర్లు, కాంగ్రెస్​ కౌన్సిలర్​ ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు పోనూ 25 మంది కౌన్సిలర్లు అధికార టీఆర్​ఎస్​ పార్టీకి చెందిన వారు ఉన్నారు. ఇందులో 12 నుంచి 14 మంది చైర్​ పర్సన్​కు వ్యతిరేకంగా వర్గంగా కొనసాగుతున్నారు. అవిశ్వాసం పెడితే సీపీఐ కౌన్సిలర్లే కీలకం కానుండడంతో ఆయా వర్గాలు ఆ పార్టీ లీడర్లు, కౌన్సిలర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.