- ఏడాదికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలి
- మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన
- హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి
బషీర్‌బాగ్, వెలుగు : మున్నూరు కాపుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన డిమాండ్ చేసింది. మున్నూరు కాపు నేతలు బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. బీసీల్లో 23 శాతం జనాభా ఉన్న మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి రూ. 5 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ... కాచిగూడలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోమెంట్ బోర్డు ఆధీనంలో నుంచి తొలిగించాలని పేర్కొన్నారు.
‘బీసీ –డి’ ఉన్న తాము రిజర్వేషన్లు పొందలేకపోతున్నామని, 10 శాతం ఈడబ్ల్యూఎస్ కల్పించాలన్నారు. మున్నూరుకాపు పేరు చివర పటేల్ అని ప్రభుత్వం గెజిట్ చేయాలని, పంట బీమా పథకం వర్తింపజేయాలని, ఏరువాక పౌర్ణమిని మున్నూరుకాపు రైతు పండుగగా సర్కారు అధికారికంగా జరపాలని కోరారు. తమ డిమాండ్లను ఏ పార్టీ మేనిఫెస్టోలో పెడితే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల లోపు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించకుంటే బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మున్నూరుకాపు సంఘం నేతలు కటికం మహేశ్, బత్తుల రాములు, ఆకుల సుధ, వసుంధర, రామిని సందీప్, మన్నె వెంకటేశ్, కల్లూరి నరహరి, గర్పల్లి గణేశ్, అనిల్, పత్తి అనిల్ పాల్గొన్నారు.