తన నామినేషన్ కోసం మునుగోడు నియోజకవర్గం నుండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తరలివస్తున్నారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరులో నామినేషన్ వేయడానికి బయల్దేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి V6 న్యూస్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర నాయకత్వంతో పాటు అనుచరులతో భారీ బైక్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు. తన రాజీనామా మునుగోడు ప్రజల కోసమేనని... నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని చెప్పారు. తనకు దేవుడంటే నమ్మకమన్న రాజగోపాల్ రెడ్డి... ఆ దేవుడే ధర్మాన్ని గెలిపిస్తాడని, మునుగోడు ప్రజలు న్యాయం వైపే ఉంటారని తెలిపారు. కేసీఆర్ వెంట ఉన్న వాళ్లంతా కూడా తెలంగాణ ద్రోహులేనన్న ఆయన... తెలంగాణ కోసం పోరాడిన వాళ్లకు రాష్ట్రంలో సముచిత స్థానం లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలనేవి రాష్ట్ర, దేశ భవిష్యత్తుని నిర్ణయించేవని చెప్పారు.
మునుగోడు ప్రజలు అత్యంత చైతన్యవంతులని... ధర్మం వైపు నిలబడతారని, రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పోరాడుతారని స్పష్టం చేశారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓటమి భయంతో కౌరవ సైన్యాన్ని దింపిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా డబ్బుల సంచులతో ప్రజల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటమి భయంతో మునుగోడులో లెంకలపల్లి గ్రామంని తీసుకొని కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యాడని చెప్పారు. ప్రాజెక్టులు, కాంట్రాక్టుల పేరుతో దోచుకునే డబ్బునే ప్రజలకు పంచి పెడుతున్నాడని, ఆ డబ్బును తీసుకోవడానికి ప్రజలు వెనుకాడరన్నారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులను తీసుకుంటారు కానీ వాళ్ళ ఓటు మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.. బీజేపీకే మాత్రమే పడుతుందని, ఆ నమ్మకం తనకుందని విశ్వాసం వ్యక్తం చేశారు.