మునుగోడు ఎన్నిక.. బీజేపీ, కేసీఆర్​మధ్య ప్రత్యక్ష యుద్ధం

‘కష్టాలెప్పుడూ ఒంటరిగా రావు. కట్టగట్టుకొని మూకుమ్మడిగా వస్తాయి’ అని షేక్స్​పియర్​550 ఏండ్ల కిందటే చెప్పారు. ఇప్పుడు కేసీఆర్​ది సరిగ్గా అలాంటి పరిస్థితే. ఆయన ముందు పెద్ద సమస్యలే వచ్చి పడ్డాయి. మునుగోడు ఎన్నిక బీజేపీ, కేసీఆర్​మధ్య ప్రత్యక్ష యుద్ధంలా తయారైంది. అటు కేసీఆర్​మీటింగ్, ఇటు అమిత్​షా సమావేశం పోటాపోటీ సభలతో రాష్ట్రంలో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  కేసీఆర్ రాజకీయ జీవితంలో 2014 నాటి ప్రకాశం ఇప్పుడు కనిపించడం లేదు ‘ఫెమిలియారిటీ బ్రీడ్స్​ కంటెంప్ట్’(ఎక్కువైతే మొఖం కొడ్తది)​ అని బెర్నార్డ్​ షా అన్నట్లు తెలంగాణలో కేసీఆర్​ చాలా ఫెమిలియర్ అయిపోయారు. ప్రజలకు ఇప్పుడు అదే సమస్య అయిఉండొచ్చు. ఎందుకంటే ప్రజలు ఆయనను ఎనిమిదేండ్లుగా చూస్తూనే ఉన్నారు కాబట్టి కొంత విసుగు కలగక మానదు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకే సినీ నటులు, సెలబ్రిటీలు బయటకు పెద్దగా ఫోకస్ అయ్యేందుకు ఇష్టపడరు.

చైనీయులు కూడా ఏండ్లపాటు ఇలాంటిదే ఓ రూల్​పాటించేవారు. వాళ్ల రాజు వారికి ఎప్పుడో ఒకసారి, చాలా అరుదుగా కనిపించేవారు. కనీసం రాజు మరణాన్ని కూడా వెంటనే ప్రకటించేవాళ్లు కాదు. ఇప్పటికీ కమ్యూనిస్ట్​ చైనా ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరిస్తోంది కూడా. కానీ కేసీఆర్​అలా కాదు. ఎప్పుడూ టీవీలు, పత్రికల్లో కనిపిస్తుండటం ప్రజలు ఆయన ఫేస్​ను చూసి చూసీ కొంత విసుగు చెందినట్టుగానే ఉన్నారు. దేశంలో చైనీస్​విధానాన్ని ఎక్కువగా ఫాలో అయ్యే ఒడిశా సీఎం నవీన్​పట్నాయక్​22 ఏండ్లుగా సీఎంగా ఉంటున్నారు. 

కేసీఆర్ కు కలిసొచ్చే అంశాలు

తెలంగాణలో ప్రతిపక్షాలు చీలిపోయి, కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యర్థులు కావడం కేసీఆర్‌కు ప్రయోజనం చేకూర్చే అంశం. ఆయన బీజీపీని, మోడీని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అలా చేయడం వల్ల మైనార్టీల ఓట్లు కాంగ్రెస్​కు బదులు టీఆర్ఎస్​కు పడే అవకాశం ఉంది. తెలంగాణ ఒక రకంగా ‘ఆటోమెటిక్​పైలట్’ స్థితిలో ఉంది. ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయకపోయినా అభివృద్ధి కొనసాగుతుంటుంది. ప్రభుత్వం చేయాల్సిందల్లా శాంతి భద్రతలను కాపాడుకోవడం, రోడ్లు, విద్యుత్, పారిశుధ్యం వంటి సాధారణ సేవలను చూడటమే.

ముంబయి, మద్రాస్, బెంగుళూరు, ఢిల్లీ వంటి నగరాలు ఆయా రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతున్నట్లే.. తెలంగాణకు హైదరాబాద్ ఒక వనరు లాంటిది. పదవీ విరమణ పొందుతున్న వారు లేదా ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారు హైదరాబాద్‌ను ఎంచుకుంటారు. ఇతర పెట్టుబడిదారులకూ హైదరాబాద్​అనుకూలం. ఇది కేసీఆర్ కంటే ముందు జరిగింది, తర్వాత కూడా జరుగుతుంది. కానీ కేసీఆర్ ఇప్పుడు ఆ క్రెడిట్ కొట్టేయొచ్చు. అందుకే సహజ ప్రయోజనాలు ఉన్న హైదరాబాద్‌ తో రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, కేసీఆర్​కు మేలు జరుగుతుంది. ఇవన్నీ కేసీఆర్​కు అనుకూలించే అంశాలు.

అసలు సమస్యలివే..

కేసీఆర్ కు ఆయన ప్రభుత్వానికి అనుకూలాంశాలు ఉన్నట్లే ప్రతికూలతలు, సమస్యలు ఉన్నాయి. రాజకీయంగా చూస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్రంలో బాగా పుంజుకుంది. తెలంగాణలో బీజేపీ కొత్త పార్టీ కావడంతో దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు చెందిన యువకులు దానికి బాగా ఆకర్షితులవుతున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో అన్ని వర్గాలకు చెందిన పాతతరం నేతలు ఇప్పటికే కొనసాగుతుండగా, ఈ రెండు పార్టీలతో పోలిస్తే.. బీజేపీలో ఆయా వర్గాల కొత్త నాయకులకు చోటు ఎక్కువ. ఇదీగాక నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్ కూడా పెద్ద అంశమే.

తెలంగాణ ఓటర్లలో 30%  మంది 2014 తర్వాత తమ ఓటును నమోదు చేసుకున్న కొత్త ఓటర్లు ఉండగా వారిని మోడీ ఇమేజ్ కొంత ఆకర్షించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ ఓటర్లు, నాయకులు ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీల మొదటి ప్రాధాన్యం కాంగ్రెస్సే. కేసీఆర్ ప్రభుత్వం కూడా పాతబడిపోయింది. ఓటర్లు కొత్తదనం కోరుకుంటారు. అవే ముఖాలు, పాత విధానాలు ఓట్లు రాల్చకపోవచ్చు. ఇకపోతే కుటుంబ పాలన కేసీఆర్​కు పెద్ద దెబ్బ. వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనను ఆయన ప్రోత్సహించడాన్ని మెజార్టీ ప్రజలు సహా ముఖ్యంగా యువత ఆమోదించడం లేదు.

అమిత్​షా సభ

మునుగోడు సభకు హాజరైన అమిత్​షా అక్కడ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తే కేసీఆర్​ప్రభుత్వం కూలుతుందన్నారు. ప్రస్తుతం కేసీఆర్​కు 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన కనీసం 50 మందికైనా వచ్చే ఎన్నికల్లో టికెట్​ఇయ్యబోరని ఎమ్మెల్యేలందరికీ తెలుసు. ఒకవేళ మునుగోడులో టీఆర్ఎస్​ఓడిపోతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోదన్న గ్యారంటీ లేదనుకున్న ఎమ్మెల్యేలు టీఆర్​ఎస్​పార్టీతో ఎందుకు ఉంటారు? సహజంగానే వారు మునిగే పడవలో ఉండరు.

అక్కడుంటే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని వారు భావించినా, పార్టీ టిక్కెట్​ఇయ్యదనిపించినా మరోపార్టీలోకి వెళ్తారు. మునుగోడు పోరు నుంచి కేసీఆర్ తప్పించుకునే అవకాశం ఉండే. మునుగోడు సీటు కాంగ్రెస్‌ పార్టీదని, విపక్షాల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని టీఆర్‌ఎస్‌ అక్కడ పోటీ చేయబోదని కేసీఆర్‌ ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు వదిలేసి ఉండొచ్చు. అప్పుడు సమస్యే వచ్చేది కాదు. కానీ ఆయన అలా చేయలేదు. రిస్క్​తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. 

- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్