కిషన్ రెడ్డి మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కళాబృందం పాటలు

మునుగోడు ఉపఎన్నికలో భాగంగా పలివెల గ్రామంలో బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. గ్రామంలో ఓవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా.. మరోవైపు టీఆర్ఎస్ కళాబృందాలు ప్రదర్శన నిర్వహించాయి. కిషన్ రెడ్డి మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కళాబృందం పాటలు పాడారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కళాప్రదర్శన ఆపాలని పోలీసులకు కిషన్ రెడ్డి చెప్పినా.. వారు పట్టించుకోలేదని బీజేపీ నేతలు ఆరోపించారు.

అంతకుముందు గ్రామంలో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ..దోచుకున్న సొమ్ముతో కేసీఆర్ విమానం కొన్నారని ఆరోపించారు. ఖాళీ భూమి ఉంటే గద్దల్లా వాలిపోయి కబ్జా చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కు తెలంగాణ అంటే ఇష్టం లేదని..అందుకే తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ గా మార్చారని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కుటుంబ పాలన ఉండాలా ? ప్రజల పెత్తనం ఉండాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాపలా కుక్కలా కూర్చుంటానని చెప్పిన  కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.