చండూరు, వెలుగు : చేనేత కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ జిల్లా నాయకుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో చండూరు చేనేత కార్మిక సంఘం, చేనేత పరిరక్షణ సేవా సమితి సభ్యులు శనివారం మునుగోడులోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత మిత్ర ద్వారా నెలకు రూ.3 వేలు వచ్చేలా కృషి చూస్తానని
ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంతోనే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని గుర్తుచేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేశ్‌యాదవ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, చేనేత పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడుప్రభాకర్ ఉన్నారు.
గురుకుల పాఠశాల ఖ్యాతిని కొనసాగించాలి..
సంస్థాన్ నారాయణపురం, వెలుగు : గురుకుల పాఠశాల ఖ్యాతిని కొనసాగించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు.
పూర్వవిద్యార్థుల సహకారంతో గురుకుల పాఠశాల ఆవరణలో నిర్మించిన నూతన భవనాలను ఆయన పరిశీలించారు. వారం రోజుల్లో మౌలిక వసతులు పూర్తిచేసి నూతన భవనాన్ని ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
బాధితులకు నష్టపరిహారం అందజేయాలి
మునుగోడు, వెలుగు : ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన బాధితులకు నష్టపరిహారం అందజేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మునుగోడు మండల కేంద్రంలోని రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో శివన్నగూడెం, కిష్టరాయనిపల్లి సాగునీటి ప్రాజెక్ట్ లపై చండూరు ఆర్డీవో, దేవరకొండ ఆర్డీవోతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు ప్రాజెక్టుల కింద ముంపు గురవుతున్న గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూ పరిహారం విషయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.