సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు, నిరసనలు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం, ఆ తర్వాత మరిచిపోవడం జరిగింది. ముఖ్యంగా 5 డీఏలు పెండింగ్ లో ఉండటం, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే పీఆర్సీ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. మునుగోడు ఉపఎన్నిక వారికి కలిసొచ్చింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న టీఆర్ఎస్.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలను రంగంలోకి దించింది. వారు కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు షరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కొందరు యూనియన్ లీడర్లు వ్యక్తిగత స్వార్థంతో మంత్రులతో చర్చలు జరిపారని ఇతర కార్మిక సంఘాల నేతలు విమర్శలు చేశారు. చర్చలకు వెళ్లిన యూనియన్ లీడర్లు వెనక్కి తగ్గారు. ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి పేరుతో కొందరితో మునుగోడులో నామినేషన్లు వేయించారు. ఈ నెలాఖరులోగా డిమాండ్లు పరిష్కరించాలని డెడ్ లైన్ విధించారు. మునుగోడు నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు 5 వేల వరకు ఉన్నట్టు అంచనా. దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్ ప్రభుత్వం 30 శాతానికి పైగా పీఆర్సీ, యూనియన్ల పునరుద్ధరణ, డీఏలు కొన్ని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు ప్రచారం చేస్తే ప్రతికూలంగా పరిణమిస్తుందని భావిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. సీఎం క్యాంప్ ఆఫీసుతో పాటు బస్ భవన్ లో అందుబాటులో ఉన్న కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మునుగోడు ఉప ఎన్నికతో దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. డిమాండ్ల అమలుకు సంబంధించిన ఆర్థికపరమైన సాధ్యసాధ్యాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. మునుగోడులో టీఆర్ఎస్ కు నష్టం కలగకుండా ఉండేందుకు.. ఆర్టీసీ కార్మికుల కొన్ని హామీలనైనా సర్కారు నెరవేర్చనున్నట్టు తెలుస్తోంది.