రేణుకా చౌదరికి ముక్కుపుడక కుట్టిస్తానన్న మునుగోడు ఓటరు

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి ఓ మహిళా ఓటరు షాక్ ఇచ్చింది. సంస్థాన్ నారాయణపురంలో తనతో మాటా మంతి చేస్తున్న రేణుకా చౌదరికే  ముక్కు పుడక కుట్టిస్తానని మహిళా ఓటరు హామీ ఇచ్చింది. ఆమె ధైర్యంగా చెప్పిన సమాధానం విన్న మాజీ మంత్రి రేణుకా చౌదరి.. ముసిముసిగా నవ్వుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపిస్తే.. వచ్చి నువ్విచ్చే ముక్కుపుడక తప్పక తీసుకెళ్తానంటూ బదులిచ్చారు.

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ప్రచారం నిర్వహిస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో ధాన్యం కుప్పలను పరిశీలించడానికి వెళ్లిన రేణుకా చౌదరి యాదమ్మ అనే మహిళా రైతును చూసి.. నీ ముక్కు పుడకలు బాగున్నాయ్.. అని ప్రశంసించగా.. యాదమ్మ వెంటనే ‘నీకు కావాలంటే కుట్టిస్తా... అని బదులిచ్చింది. ఊహించని జవాబు విన్న రేణుకా చౌదరి.. నవ్వుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపిస్తే .. మళ్లీ తప్పకుండా వచ్చి.. నువ్విచ్చే ముక్కుపుడక తీసుకెళ్తానని జవాబిచ్చారు. మాజీ మంత్రికి.. మహిళా రైతుకు మధ్య జరిగిన  సంభాషణ తాలూకు ఫోటోలు.. వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్స్.. మీమ్స్ తో..  కామెంట్లతో స్పందిస్తున్నారు.