- మూడున్నరేండ్లు నియోజకవర్గ అభివృద్ధికి పైసా ఇయ్యని సర్కార్
- రాజగోపాల్ రాజీనామాతో పనులు షురూ
- రోడ్ల కోసం రూ.230 కోట్లు కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మునుగోడులో పనులు చేస్తోంది. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన రోజు నుంచే మునుగోడు నియోజకవర్గం ఉన్న నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ ఉండగా కొత్తగా ఎలాంటి పనులు ప్రారంభించకూడదు. ప్రారంభోత్సవాలు కూడా చేయొద్దు. కానీ ఈ నిబంధనలను సర్కార్ ఉల్లంఘిస్తోంది. మూడున్నరేండ్లు మునుగోడు అభివృద్ధికి పైసా ఇవ్వని ప్రభుత్వం.. ఉప ఎన్నిక రావడంతో హడావుడిగా రోడ్ల పనులు చేపట్టింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో వివిధ రోడ్లకు రూ.230 కోట్లు కేటాయించింది. తన రాజీనామాతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేయడంతో కేటాయించిన నిధులను సర్కార్ విడుదల చేయలేదు. తీరా ఎన్నిక షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రజల్లో కోపాన్ని చల్లార్చేందుకు రోడ్ల నిర్మాణానికి పూనుకుంది. అనేక గ్రామాలకు దెబ్బతిన్న లింక్ రోడ్లను రిపేర్ చేయడంతో పాటు పలు కొత్త రోడ్ల పనులు ప్రారంభించింది.
రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్న సర్కార్...
రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకే పరిమితం చేసిన ప్రభుత్వం.. మునుగోడులో లబ్ధిదారులకు గొర్రెలు కాకుండా స్కీం ద్వారా ఇచ్చే మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. 7,600 మంది గొల్ల, కురుమల బ్యాంకు ఖాతాల్లో రూ.98.76 కోట్లు జమ చేసింది. వంద మంది లబ్ధిదారులకు దళితబంధులో భాగంగా రూ.10 కోట్లు పంపిణీ చేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పెండింగ్ అప్లికేషన్‌లన్నీ క్లియర్ చేసి, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం రూ.500 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇన్నాళ్లు గుంతల రోడ్లతో అవస్థలు పడ్డ ప్రజలు.. ఇప్పుడు వాటికి రిపేర్లు చేస్తుండటంతో ఎమ్మెల్యే రాజీనామాతోనే పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. హడావిడిగా రోడ్లు వేయడం కాకుండా నాణ్యతతో పనులు చేయాలని, రోడ్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపైనా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.