మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ 

మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ 

మునుగోడు ఉప ఎన్నిక స్ట్రాటజీ, క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ గా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ నియమించారు. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయన్నారు.  రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న మధుయాష్కీని  గత నెల 2వ తేదీన ఏడుగురు సభ్యులతో స్ట్రాటజీ అండ్ క్యాంపెయిన్ కమిటీ కి కన్వీనర్ గా ఏఐసీసీ నియమించింది. ఇందులో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, అనిల్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. అయితే స్థానిక నేతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో కన్వీనర్  బాధ్యతలను రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అప్పగించారు.

మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవికి రాజీనామా చేయడంతో అనివార్యంగా ఉప ఎన్నిక ఏర్పడింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇటు కాంగ్రెస్ నుంచి ఉప ఎన్నిక బరిలో పాల్వాయి స్రవంతి ఉన్నారు. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచి తీరాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.