టీఆర్ఎస్,బీజేపీ, కాంగ్రెస్కు మునుగోడు ఫీవర్

టీఆర్ఎస్,బీజేపీ, కాంగ్రెస్కు మునుగోడు ఫీవర్

తెలంగాణ ఏర్పాటుకు ముందు అప్పుడున్న ప్రభుత్వంలో టీఆర్ఎస్​అధినేత కేసీఆర్, ఆయన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తూ.. ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఒక పొలిటికల్​ టెన్షన్​ 
సృష్టించేవారు. ఇప్పుడు కేసీఆర్ సర్కారులో ప్రతిపక్షాలు అదే పనిచేస్తున్నాయి. ఉప ఎన్నికలు ఒక రకంగా ప్రభుత్వ పనితీరుకు తీర్పు లాంటివి. 119 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో టీఆర్ఎ స్​కు దాదాపు100 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అంతర్గతంగానే పోటీ నెలకొంది. దుబ్బాక, హుజూరాబాద్​ ఎన్నికల్లో ప్రభుత్వంపై అసమ్మతి  కారణంగా బీజేపీ చేతిలో టీఆర్​ఎస్​ ఓడిపోవాల్సి వచ్చింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఇప్పుడు బీజేపీ నుంచే మరో సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

గెలిస్తేనే ముందుకు?
మునుగోడు కాంగ్రెస్ స్థానం. ఆ పార్టీకి నల్గొండలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. కాబట్టి ఈ సిట్టింగ్​స్థానాన్ని నిలబెట్టుకోలేక
పోవడం ఉపేక్షించలేని చర్యే అవుతుంది. అభ్యర్థిగా అత్యంత సీనియర్​నాయకుడిని నిలబెట్టి అయినా.. గెలవాల్సిన పరిస్థితి.  రెండు ఉప ఎన్నికల్లో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న అధికార టీఆర్ఎస్​ పార్టీకి కూడా ఈ సీటు గెలవడం తప్ప మరో గత్యంతరం లేదు. రాజగోపాల్ రెడ్డి​రాజీనామా చేసి మరి బీజేపీలో చేరుతున్నారు కాబట్టి ఆ పార్టీపై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ఒక రకంగా మూడు పార్టీలు ఒకే స్థితిలో ఉన్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి గెలిచేందుకు సర్వశక్తులొడ్డుతుంది. మునుగోడులో గెలుపు కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా నిలబెడుతుంది. బీజేపీ తన జోరును కొనసాగించాలంటే మునుగోడులో విజయం సాధించాల్సిందే. 

పార్టీలపై ప్రభావం ఎలా ఉంటుంది?
మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే కేసీఆర్‌ ప్రతిష్ట మళ్లీ పెరుగుతుంది. అదే ఊపుతో ఆయన 2023 జులైలో ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. మునుగోడు గెలుపుతో వచ్చే ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత ఎక్కువ ఉన్న 50 మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలను మార్చుకునే వెసులుబాటు ఆయనకు ఉంటుంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్​విజయం సాధిస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ​పార్టీకి సవాల్ గా మారడంతోపాటు బీజేపీ జోరును తగ్గించే అవకాశం ఉంటుంది. పార్టీలో రేవంత్​పై వ్యతిరేకతకు ఆస్కారం ఉండదు. మునుగోడులో కాంగ్రెస్​ ఓడితే ఆ పార్టీ ఉనికికే ప్రమాదం. రేవంత్​ భవిష్యత్​ కూడా ప్రశ్నార్థకమే! ఇక్కడ బీజేపీ విజయం సాధిస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుంది. టీఆర్ఎస్​కు ప్రధాన ప్రత్యర్థిగా మారుతుంది. టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే చాన్స్​ ఉంటుంది. ఓడిపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి రావొచ్చు.

కేసీఆర్​ వ్యూహం మారుస్తారా?
మునుగోడు ఉప ఎన్నిక రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ మధ్య జరగనుంది. ఈ ఎన్నికలో గాంధీలు, ఇతర జాతీయ నేతల ప్రభావం తక్కువ ఉండొచ్చు. తెలంగాణ అభ్యర్థులను బట్టే ప్రజలు ఓట్లు వేసే ఆస్కారం ఉంటుంది. అధికార టీఆర్ఎస్​పార్టీలో మాత్రం ఓటర్లు కేసీఆర్​ను చూస్తారు. అధికార పార్టీ దుబ్బాక, హుజూరాబాద్​ఉప ఎన్నికల్లో డబ్బులు, పథకాలు, వాగ్దానాలతో హోరెత్తించినా ప్రతికూల ఫలితమే వచ్చింది. ఈసారి కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుంది. అదే ఫెయిల్ మెడిసిన్‌ను ప్రయోగిస్తారా? మారుస్తారా? చూడాలి. బీజేపీ దాదాపుగా రాజగోపాల్​రెడ్డినే బరిలో దింపే అవకాశం ఉండగా, కేసీఆర్​టీఆర్​ఎస్​ నుంచి రెడ్డినే పోటీలో పెట్టి, కాంగ్రెస్​ పార్టీ కూడా రెడ్డి అభ్యర్థిని ప్రకటిస్తే మునుగోడు ఉప ఎన్నిక ఆల్ ​రెడ్డి ఎన్నిక అవుతుంది. మనుగోడులో ఎవరు గెలుస్తారన్నది కీలకం కాగా, రెండో స్థానంలో ఎవరు వస్తారనేది కూడా ముఖ్యమే. మూడో స్థానానికి పరిమితమైన పార్టీ పాత్ర వచ్చే సాధారణ ఎన్నికల్లో పరిమితంగానే ఉండొచ్చు.

- పెంటపాటి పుల్లారావు,  పొలిటికల్​ ఎనలిస్ట్- పెంటపాటి పుల్లారావు,  పొలిటికల్​ ఎనలిస్ట్