మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కుతోంది. వివిధ పార్టీల క్యాడర్ మధ్య గొడవలు ముదురుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో రోజుకో చోట ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అక్కడక్కడ బీజేపీ క్యాడర్ తో ఘర్షణకు దిగుతున్నాయి. ఇందులో టీఆర్ఎస్ ప్రేరేపిత నిరసనలే ఎక్కువగా ఉంటున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా.. తమకు సంబంధం లేదని టీఆర్ఎస్ నేతలు చెప్పుకొస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. పెట్రోల్, డిజిల్ ధరలు పెంచిన బీజేపీని ఓడించాలని, గ్యాస్ సిలిండర్, ప్ల కార్డులతో టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్ది రోజుల కింద ఇదే గ్రామంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ అభ్యర్థి కోమ టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మి ప్రచారానికి రాగా, టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి ప్రసంగం కొనసాగినంత సేపు వ్యతిరేక నినాదాలు చేశారు. ఇదేరోజు సంస్థాన్ నారాయణపురంలో బీజేపీ నేత, మాజీ మంత్రి బాబూమోహన్ ప్రచారం సందర్భంగా జరిగిన గొడవతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో పాటు ధర్నా చేశారు. ఈ మండలంలోనే ఉన్న జైకిసారంలో శనివారం ప్రచారానికి వెళ్లిన మాజీ ఎంపీ బూర నర్సయ్యను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బూర నర్సయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గతంలో నాంపల్లి మండలం తుంగపాడులో, నారాయణపురం మండలంలోని గుజ్జ, కోతులాపురం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు. కోతులాపురం గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రచారానికి కూడా ఆటంకం సృష్టించారు. దీంతో ఆయా గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆదివారం నాంపల్లి మండలంలో ప్రచారానికి వెళ్తున్న తన కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. దీనిపై పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చారు.
చినకొండూరులో...
యాదాద్రి: యాదాద్రి జిల్లా చౌటుప్పల్మండలం చినకొండూరులో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చినకొండూరులో ఆదివారం ప్రచారానికి వచ్చారు. ఇదే టైంలో కొందరు టీఆర్ఎస్కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారి దగ్గర పార్టీ జెండాలు, కండువాలు లేకపోవడంతో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. రాజగోపాల్‌రెడ్డి ప్రసంగం మొదలుపెడుతుండగా బీజేపీ, రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిలిండర్‌ను పైకి చూపుతూ రేట్లు పెంచిన బీజేపీని ఓడించాలంటూ నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ రోడ్డు మీదకు దూసుకొచ్చారు. ఎదురుపడి తోపులాటకు దిగారు. దీంతో పోలీసులు వారిని ఆపడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బీజేపీ లీడర్లు జోక్యం చేసుకొని తమ కార్యకర్తలను సముదాయించి, వెనక్కి తీసుకెళ్లారు. పోలీసులు కూడా హెచ్చరించడంతో అటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వెనక్కి తగ్గారు.
కాన్వాయ్కి దారివ్వలేదని కాంగ్రెస్, బీజేపీ ఘర్షణ
చండూర్ (నాంపల్లి) : తన కాన్వాయ్కి దారివ్వకపోవడమే గాక, ఇదేంటని అడిగిన తమ డ్రైవర్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. ఈక్రమంలో ఇరువర్గాల నడుమ ఘర్షణ జరగడంతో నాంపల్లి అంబేద్కర్‌చౌరస్తా వద్ద ఆమె ధర్నా చేశారు. పాల్వాయి స్రవంతి రెండు వాహనాలతో చండూర్ నుంచి నాంపల్లి మండలంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఆమె ముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి భార్య నివేదిత నాంపల్లిలో జరిగే ప్రచారానికి వెళ్తున్నారు. పాల్వాయి కార్లు నివేదిత వెహికిల్‌ను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించగా ఆమె డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. మండల కేంద్రం సమీపంలో నివేదిత వాహనం సైడ్ ఇవ్వగా, ఎందుకు సైడ్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. ఈలోగా అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు మాటమాట అనుకున్నారు. ఈ క్రమంలో గొడవ పెరిగి, తన కాన్వాయ్ లోని ఒక కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని, తన డ్రైవర్‌ను కొట్టారని స్రవంతి ఆరోపించారు. డ్రైవర్ ను కొట్టినవాళ్లపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తర్వాత నాంపల్లి అంబేద్కర్ చౌరాస్తా వద్ద 200 మంది కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. ఆందోళనలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షుడు శంకర్‌నాయక్, పున్న కైలాస్‌నేత, చమల కిరణ్‌కుమార్‌రెడ్డి, కొమ్ము భిక్షం, దామెర యాదయ్య, సంజీవ పాల్గొన్నారు.