- 2.27 లక్షల మంది ఓటర్లలో 1.50 లక్షల మంది బీసీలే
- జిల్లాలో అత్యధిక బీసీ ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇదే
- తీవ్ర అసంతృప్తిలో పార్టీల లీడర్లు, కుల సంఘాలు
నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలేవీ బీసీలకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆయా పార్టీల్లోని బీసీ లీడర్లు నారాజ్ అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం మునుగోడు. దీంతో బైపోల్లో బీసీలకే టికెట్ ఇవ్వాలని కుల సంఘాలు మొదటి నుంచీ డిమాండ్ చేస్తూ వచ్చాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంతోపాటు, గౌడ, యాదవ, ముదిరాజ్, పద్మశాలి సంఘాలు బీసీలకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే మునుగోడు కేంద్రంగా గౌడ, యాదవ, పద్మశాలీ సంఘాల పెద్దలు మీటింగులు పెడ్తూ తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. బీసీలకు టికెట్ ఇవ్వకుంటే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కానీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓసీలకు, అందులోనూ రెడ్డి సామాజికవర్గానికే టికెట్లు ఇచ్చాయి. తీరా ఇప్పుడు వారిని గెలిపించుకునేందుకు బీసీల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నాయి. ఈ క్రమంలో మూడు పార్టీల తీరుపై బీసీ సంఘాల నేతలు మండిపడ్తున్నారు. తమను లీడర్లుగా కాకుండా ఓటర్లుగా నే చూస్తున్నారని లోలోపలే కుమిలిపోతున్నారు.
అధికారపార్టీలో తిరుగుబాటు చేసినా..
అధికార పార్టీకి ఆదిలోనే బీసీ లీడర్ల నుంచి తిరుగుబాటు ఎదురైంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మె ల్సీ కర్నె ప్రభాకర్, నారబోయిన రవి లాంటి వారంతా టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించబోమని తేల్చి చెప్పారు. ఒకదశలో ఆయనకు టికెట్ ఇవ్వవద్దని స్థానిక ప్రజాప్రతినిధులతో మీటింగులు పెట్టి మరీ చెప్పించారు. కానీ ఇవేమీ పట్టించుకోని హైకమాండ్ చివరికి కూసుకుంట్లకే టికెట్ ఖరారు చేసింది. బూర నర్సయ్య, కర్నె లాంటి లీడర్లను పలుమార్లు హైదరాబాద్ కు పిలిపించి బుజ్జగించింది. ఇప్పటికీ ఆయా నేతలను దూరంగానే పెడ్తోంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ఆ పార్టీ ఆయనకే మళ్లీ చాన్స్ ఇవ్వక తప్పలేదు. టీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ పార్టీలోనూ టికెట్ కొట్లాట జరిగింది. బీసీ లీడర్లు పున్నా కైలాష్ నేత, పల్లె రవికుమార్ లాంటి వాళ్లు టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. కొత్తగా పార్టీలో చేరిన డాక్టర్ సుధాకర్ గౌడ్ తనకు టికెట్ వస్తదని ఆశించారు. మరోవైపు బీసీలకు దీటుగా ఓసీ వర్గం నేతలు కూడా టికెట్ కోసం పట్టుబట్టారు. ఓ వైపు పాల్వాయి స్రవంతి, మరోవైపు చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీ పడ్డారు. పలు సమీకరణాల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ స్రవంతికే టికెట్ ఇచ్చింది. ఇలా మూడు ప్రధాన పార్టీలు ముగ్గురు రెడ్లకే టికెట్లు ఇవ్వడంతో బీసీ నేతల్లో నిరాశ అలుముకుంది.
ఓసీల కోసం బీసీల మద్దతు కూడగడ్తున్న పార్టీలు..
ఓసీలకు టికెట్ ఇచ్చిన ప్రధాన పార్టీలు ఇప్పుడు బీసీల ఓట్ల కోసం ఆయా కులాల వెంటపడ్తున్నాయి. ముఖ్యంగా రూలింగ్ పార్టీ, గొల్ల కుర్మలకు గొర్రెల చెక్కులు, గౌడ్లకు నీరా లైసెన్స్‌లు, పద్మశాలీలకు నేతబంధు, ప్రభుత్వం నుంచి లోన్లు, ముదిరాజ్‌లకు చేపపిల్లల పంపిణీ ఆశచూపుతూ ఓట్లడుగుతోంది. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కుల సంఘాల వారీగా మీటింగులు పెట్టి హామీలు గుప్పిస్తున్నారు. ఇక బీజేపీ తమ వల్లే బీసీలకు ప్రభుత్వం ఇదంతా చేస్తోందని ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్ లీడర్లు బీసీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు గొర్రెలు, బర్రెలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికుల గురించి పట్టించుకోని ప్రభుత్వం కేవలం ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే స్కీములు, పైసలు ఇస్తోందని విమర్శిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీల వైఖరిపై బీసీ లీడర్లు మండిపడ్తున్నారు. నియోజకవర్గంలో బలమైన బీసీ లీడర్లు ఉన్నప్పటికీ పక్కనపెట్టి బీసీలను కేవలం ఓటర్లుగా చూస్తున్నాయని విమర్శిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీసీలకు మూడు పార్టీలు అన్యాయం చేశాయని రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తాజాగా ఫైర్ అయ్యారు. మూడు ప్రధానపార్టీలన్నీ సిండికేట్ గా మారి ఓసీలకు టికెట్లు ఇచ్చుకున్నాయని ఆరోపించారు.
నియోజకవర్గంలో 66 శాతం బీసీ ఓటర్లే..
మునుగోడు నియోజకవర్గంలో 2.27 లక్షల మంది ఓటర్లుండగా, ఇందులో లక్షన్నర మంది అంటే 66 శాతం బీసీ ఓటర్లే. వీరిలోనూ గౌడ, యాదవ, పద్మశాలీ, ముదిరాజ్ కులాలదే పైచేయి. అందువల్లే బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ టికెట్ కోసం పట్టుబట్టారు. కర్నె ప్రభాకర్ భార్య పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన కూడా సీరియస్‌గానే ప్రయత్నించారు. మునుగోడులో బీసీలకు టికెట్ ఇవ్వాలని గౌడ, యాదవ కుల సంఘాలు ప్రత్యేకంగా మీటింగ్‌లు పెట్టి మరీ డిమాండ్ చేశాయి. మునుగోడు చిన్నకొండూరు నియోజకవర్గంగా ఉన్నప్పుడు పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పాటైంది. తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ తరపున బొమ్మగాని ధర్మభిక్షం (గౌడ), 1999 ఎన్నికల్లో జెల్లా మార్కెండేయులు (పద్శశాలీ), 2004 ఎన్నికల్లో చిలువేరు కాశీనాథ్ (పద్మశాలీ) పోటీ చేశారు. లక్ష్మణ్ బాపూజీ తప్ప మిగిలిన ముగ్గురూ ఓడిపోయారు. రెడ్డి, వెలమ సామాజిక వర్గానికి చెందిన లీడర్లే ఇక్కడ ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలోనే బైపోల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ వినిపించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓసీలకే టికెట్ ఇవ్వడంతో బీఎస్పీ బీసీ నేత శంకరాచారికి, ప్రజాశాంతి, టీజేఎస్ ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్‌ను రంగంలోకి దింపాయి.