నల్లగొండ హోటల్స్ తోపాటు మునుగోడు చుట్టూ ఫాంహౌస్ లు, తోటల్లో మకాం

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి,వెలుగు : రాష్ట్రంలో రెండు నెలలుగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక తుదిదశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి నాన్ లోకల్ లీడర్స్, క్యాడర్ రాత్రి నియోజకవర్గాన్ని వీడారు. అయితే గ్రామాలకు ఇన్ చార్జీలుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పోలింగ్ అయిపోయే వరకు తమకు కేటాయించిన గ్రామాల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు నియోజకవర్గానికి సమీపంలోనే నల్లగొండ, చిట్యాల, నార్కట్ పల్లి మండలాల్లోని హోటళ్లు, ఫామ్ హౌస్ లు, తోటల్లో మకాం వేసినట్లు తెలిసింది. అక్కడ నుంచి కార్యకర్తలు, నాయకులకు గైడెన్స్ ఇచ్చేందుకు ఫోన్లలో మాట్లాడుతున్నారు. వారంతా మునుగోడులో లేకున్నా ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో చెప్తున్నారు. పోల్ మేనేజ్ మెంట్ ను పరిశీలిస్తున్నారు. చిట్యాల మండలం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న ఓ నాయకుడి ఫాంహౌస్​, ఇంటి నుంచి వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు తెలిసింది.

రంగంలోకి ఇంటెలిజెన్స్‌..  
మునుగోడులో ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు నుంచే స్థానిక రాజకీయ పరిస్థితులు, ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ను రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఇప్పటికే డైలీ, వీక్లీ రిపోర్టులు అందజేస్తున్న ఇంటెలిజెన్స్ బృందాలు బుధవారం మరోసారి సర్వే సిద్ధమైనట్లు సమాచారం. మునుగోడులో ప్రలోభాల పర్వం పూర్తి కావడంతో.. ఇప్పుడు ఓటర్ల మనోగతం ఎలా ఉందనే విషయంపై వీరు ఆరా తీయనున్నారు. సాయంత్రం వరకు రాష్ట్ర సర్కార్ కు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చే అవకాశముంది.