- చండూరులో జంపింగ్ జపాంగ్‌లు
చండూరు, వెలుగు: నెల రోజుల కింద టీఆర్ఎస్ కు చెందిన నలుగురు సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సర్పంచ్బీజేపీలో చేరగా..ఆదివారం మళ్లీ టీఆర్ఎస్లో చేరారు. చండూరు మండలంలోని పలు గ్రామాల సర్పంచులు ఇటీవల రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఏమైందో ఏమో గాని ఆదివారం చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం సమక్షంలో హైదరాబాద్‌లోని మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంట్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో దొనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ ముందు కాంగ్రెస్ నుంచి గెలుపొంది తర్వాత టీఆర్ఎస్లో చేరారు.
నెల కింద రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలోకి రాగా, మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్లోకే పోయారు. అలాగే టీఆర్ఎస్కు చెందిన గుండ్రపల్లి సర్పంచ్ తీగల సుభాష్, నేర్మట సర్పంచ్ నందికొండ నరసింహ, కస్తాల సర్పంచ్ ద్రౌపదమ్మ, తుమ్మలపల్లి సర్పంచ్ కృపాటి రాములమ్మలు కూడా నెల కింద బీజేపీలో చేరి ఇప్పుడు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. అధికార పార్టీతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో మళ్లీ టీఆర్ఎస్లో చేరుతున్నట్టు పార్టీ మారిన సర్పంచులు ప్రకటించారు.