నల్గొండ, వెలుగు:
మునుగోడు ఉప ఎన్నికల్లో యువ, మహిళా ఓటర్లపై ప్రధాన రాజకీయ పార్టీలు గురి పెట్టాయి. ఈ రెండు సెక్షన్లలో మెజారిటీ ఓటర్లు నోటుకు లొంగకుండా నిక్కచ్చిగా ఓటు వేస్తారని ఆయా పార్టీలు నమ్ముతున్నాయి. ముఖ్యంగా యువత, అందులోనూ నిరుద్యోగుల్లో రూలింగ్ పార్టీ పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. టీఆర్ఎస్ చేయించిన సర్వేల్లోనూ ఈ విషయం వెల్లడైంది. దీంతో యూత్‌ను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో యువత ఓట్లు చేజారకుండా టీఆర్ఎస్ హైకమాండ్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది.
కొత్త ఓటర్లపై బీజేపీ ఫోకస్..
యువతీయువకులతో పాటు తొలిసారి ఓటు హక్కు పొందిన విద్యార్థులు, మహిళా ఓట్లపై బీజేపీ ఫోకస్ పెట్టింది.18 ఏండ్లు నిండిన విద్యార్థులు, మొదటిసారి ఓటు హక్కు పొందిన వాళ్లను తమ వైపు తిప్పుకునేందుకు ఒక సమ్మేళనం నిర్వహించనుంది. దీనికి చీఫ్ గెస్టుగా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగుళూర్ ఎంపీ తేజస్వీ సూర్యను ఆహ్వానించాలని భావిస్తోంది. ఈ నియోజకవర్గంలో మహిళల ఓట్లు కూడా లక్షకు పైగానే ఉండడంతో వారి ఓట్లను కూడా బీజేపీకి పడేలా ఆ పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 20 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఆరు గురు మహిళా మోర్చా ప్రతినిధులు ఉంటారు. ఒక్కో మహిళా రెండు శక్తి కేంద్రాల పరిధిలోని మహిళలను నేరుగా కలిసి ఓటు అడుగనున్నారు. ఇక కాంగ్రెస్ ఇప్పటికే మహిళా సెంటిమెంట్‌తో ముందుకు పోతోంది. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మహిళలకు బొట్టు, గాజులు పంచుతూ ఒక ఆడబిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరుతోంది. దీంతోపాటు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ విభాగాలతో మునుగోడులో ఇంటింటి ప్రచారం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఆయా టీమ్‌లు ఇప్పటికే రంగంలోకి దిగి, టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఏరకంగా మోసం చేస్తోందనే విషయాన్ని ఊరూరా ప్రచారం చేస్తున్నారు. లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి హామీలు అమలు చేయని సర్కారుకు గుణపాఠం చెప్పాలని యువ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
టీఆర్ఎస్వీ నుంచి 240 మంది..
తెలంగాణ వచ్చాక ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, ఆ స్థాయిలో నోటిఫికేషన్లు వేయలేదు. నిరుద్యోగ భృతి హామీని సైతం నిలబెట్టుకోలేదు. దీంతో యూత్, ముఖ్యంగా నిరుద్యోగులు టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకంగా తయారయ్యారని ఆ పార్టీ నిర్వహించిన పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడైంది. చాలా మంది యువతీయువకులు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ నివేదికల్లో బయటపడింది. ఇది ఓట్ల రూపం తీసుకుంటే మునుగోడులో టీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అందుకే యూత్‌ను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ పెద్దలు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఇందుకోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లోని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం(టీఆర్ఎస్వీ) నుంచి 240 మందిని రంగంలోకి దింపారు. యూత్‌ను టీఆర్ఎస్ వైపు ఎలా ఆకట్టుకోవాలనే అంశంపై ఇప్పటికే కేటీఆర్ నేతృత్వంలో వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలను ఎనిమిది యూనిట్లుగా విభజించి, యూనిట్‌కు 30 మంది చొప్పున 240 మందికి బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 17 నుంచి వీరంతా తమకు కేటాయించిన మండలాల్లో పర్యటిస్తారు. టౌన్లు, మండలాలు, మేజర్ గ్రామపంచాయతీల వారీగా యువతీ యువకులు, విద్యార్థులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైంది? తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధి ఎలాంటిది? తీరా ఇప్పుడు బీజేపీ లాంటి మత పార్టీల చేతుల్లోకి వెళ్తే జరిగే నష్టం ఏమిటి? లాంటి విషయాలను వివరిస్తామని టీఆర్ఎస్వీ మండల ఇన్చార్జి ఒకరు ‘వెలుగు’కు వివరించారు.