నల్గొండ అర్బన్ : మునుగోడు ఉప ఎన్నికలో పాల్గొనే పోలింగ్ సిబ్బంది డ్యూటీ సక్రమంగా చేయాలని ఎలక్షన్ అబ్జర్వర్ పంకజ్‌కుమార్, నల్గొండ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు గురువారం పట్టణంలోని ఎన్‌జీ కాలేజీలో నిర్వహించిన ట్రైనింగ్ క్లాస్‌లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈవీఎం, వీవీ ప్యాట్ పనితీరుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలక్షన్ సిబ్బంది నవంబర్ 2వ తేదీ ఉదయం 8 గంటల వరకు చండూరులోని డాన్ బాస్కో జూనియర్ కాలేజీలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ గుర్తించిన 12 కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొచ్చిన వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు, నల్గొండ ఆర్డీవో జయచంద్రారెడ్డి, జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఈవో భిక్షపతి, మాస్టర్ ట్రైనర్లు తరాల పరమేశ్, బాలు ఉన్నారు.
కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు
మునుగోడు ఉప ఎన్నిక ఫిర్యాదులు తీసుకునేందుకు నల్గొండ కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉంటే 08682 230198 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.
వడ్ల కొనుగోళ్లలో అక్రమాలు చేస్తే క్రిమినల్ కేసులు
సూర్యాపేట/తుంగతుర్తి : వడ్ల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ హెచ్చరించారు. రైతులకు నష్టం కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చే రైతులకు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలని, కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేయాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి వడ్లు రాకుండా జిల్లా సరిహద్దుల్లో నిఘా పెట్టాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందులు పెట్టే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం 70 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 1.50 బ్యాగుల కోసం ఆర్డర్ పెట్టినట్లు చెప్పారు. అనంతరం వడ్ల కొనుగోళ్లకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు, డీఏవో రామారావునాయక్, డీఎం.రాంపతి నాయక్, మార్కెటింగ్ ఆఫీసర్ సంతోష్, డీసీవో శ్రీనివాస్, డీఎస్‌వో పుల్లయ్య పాల్గొన్నారు. అనంతరం డీఈవో అశోక్‌తో కలిసి తుంగతుర్తి మండలం వెంపటి ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఒకటి, రెండు, మూడు తరగతులను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకే ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.
టీఆర్‌ఎస్‌ను ఖతం చేసేందుకు కుట్ర
యాదగిరిగుట్ట : టీఆర్‌ఎస్ పార్టీని ఖతం చేయాలని కుట్ర చేస్తున్న ప్రధాని మోడీ, బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం, తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లికి చెందిన పలువురు గురువారం యాదగిరిగుట్టలో మహేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు మేధావుల పార్టీ అని పేరున్న బీజేపీని ఇప్పుడు ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ బీకూనాయక్, ఆలేరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుధ హేమేందసర్‌గౌడ్, రాజాపేట మండల అధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి పాల్గొన్నారు.
అమరుల త్యాగం చిరస్మరణీయం
కోదాడ : లా అండ్ ఆర్డర్‌ను కాపాడడంలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగం చిరస్మరణీయం అని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం కోదాడ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో పట్టణ పీఎస్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆరోగ్యవంతులైన వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, డివిజన్ సీఐలు శివశంకర్, పీఎన్‌డీ ప్రసాద్,
ఆంజనేయులు, రామలింగారెడ్డి, ఎస్‌బీ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
నల్గొండ 12వ బెటాలియన్‌లో...
నల్గొండ అర్బన్ : పోలీస్ అమరుల వారోత్సవాల్లో భాగంగా గురువారం నల్గొండ జిల్లా అన్నేపర్తి బెటాలియన్‌లో కమాండెంట్ ఎన్‌వీ సాంబయ్య ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, అశోక్‌కుమార్, తిరుపతి, యూనిట్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు.
యూనివర్సిటీల్లో టూరిజం డిపార్ట్‌మెంట్ ఏర్పాటుచేయాలి
నల్గొండ అర్బన్ : ప్రతి యూనివర్సిటీలో టూరిజం డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ సూచించారు. నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీలో గురువారం జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, మన సంస్కృతి, యాస, వంటకాలను సరికొత్త పద్ధతుల్లో అందించడం ద్వారా టూరిస్టులను ఆకర్షించవచ్చన్నారు. ఒక టూరిస్ట్ ప్లేస్‌కు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను కలిసి సర్క్యూట్‌గా మార్చడం, మహిళలకు అవకాశాలు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చన్నారు. ఇలాంటి పరిశోధనలను ప్రోత్సహించడంతో ఉన్నత విద్యా మండలి ముందుంటుందని చెప్పారు. ఎంజీయూ వీసీ చొల్లేటి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ పరిస్థితులను పరిశోధన అంశాలుగా మార్చి పరిష్కారాలు కనుగొనడం వల్ల సమాజానికి మేలు చేసేందుకు యూనివర్సిటీలు కృషి చేయాలని చెప్పారు. కార్క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్. నాగేశ్వరరావు, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, నిర్వాహకులు డాక్టర్ ఆకుల రవి, మారం వెంకటరమణారెడ్డి, సురేశ్‌రెడ్డి, అలువాల రవి, శ్రీదేవి, అంజిరెడ్డి, సరిత, అనురాధ శ్రీలక్ష్మి, లక్ష్మీప్రభ, శ్వేత, జ్యోతి పాల్గొన్నారు.
మైనర్ ఇరిగేషన్ ద్వారా ఎస్సీలకు లబ్ధి
తుంగతుర్తి : మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఎస్సీలకు లబ్ధి చేకూరుతుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష చెప్పారు. ప్రధాని అనుసూచిత్ అభ్యుదయ యోజనపై సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో గురువారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని రావులపల్లి, కేశవాపురం పంచాయతీలకు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరైందన్నారు. ఇందులో భాగంగా ఎస్సీ కుటుంబాలకు చెందిన రైతులకు బోర్లు, బావులు, పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయా గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఫ్యామిలీల సమగ్ర సమాచారం సేకరించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భీంసింగ్ నాయక్, తహసీల్దార్ రాంప్రసాద్, ఇరిగేషన్ డీఈ నవీన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నరేశ్, రావులపల్లి సర్పంచ్ యాదమ్మ, కేశవాపురం సర్పంచ్ అనిత పాల్గొన్నారు.
కేంద్ర పథకాలపై అవగాహన కల్పించాలి
చౌటుప్పల్ : కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు సూచించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి ఓటరును కలిసి ఈవీఎంలో కమలం పువ్వును గుర్తును చూపిస్తూ ప్రచారం చేయాలని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ ఇన్‌చార్జి నందకుమార్ యాదవ్, పిట్టల అశోక్ ఉన్నారు.
కాంగ్రెస్‌ను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తం
చౌటుప్పల్ : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ పాల్వాయి స్రవంతిని గెలిపిస్తే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం చౌటుప్పల్‌లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. డబ్బులు పంచి గెలిచేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఆ పార్టీలు ఇచ్చే డబ్బు తీసుకొని ఓటు మాత్రం స్రవంతికి వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలోనే అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని చెప్పారు. ఆయన వెంట పొత్నక్ ప్రమోద్‌కుమార్ ఉన్నారు.
ఫార్మా కంపెనీ పర్మిషన్ రద్దు చేయాలి
చండూరు : నల్గొండ జిల్లా గట్టుప్పల్ – పుట్టపాక మధ్య నిర్మించే ఫార్మా కంపెనీ పర్మిషన్‌ను రద్దు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య యాదవ్ డిమాండ్ చేశారు. గట్టుప్పల్ మండలం తేరట్‌పల్లిలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కంపెనీ ఏర్పాటు వల్ల 10 నుంచి 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ విషయంపై మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా గట్టుప్పల్ ఇన్‌చార్జిగా ఉన్న కేటీఆర్‌ను ప్రజలు నిలదీయాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల కోసం టీడీపీ హయాంలోనే అనేక పథకాలు అమలయ్యాయని చెప్పారు. టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి మక్కెన అప్పారావు, చండూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్రజల్ల, ఎండి షరీఫ్, గోసుకొండ వెంకటేశం, శ్రీకాంత్, గుర్రం కొండయ్య, పంకర్ల చంద్రయ్య పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల సేవలు అభినందనీయం
హుజూర్‌నగర్ : రిటైర్డ్ ఉద్యోగులు సమాజానికి చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రచురించిన సావనీర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగుల కార్యక్రమాలకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎమ్మెల్యేను శాలువా, మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రావెళ్ల విశ్వాస్‌రెడ్డి, గుంతకళ్ల దామోదర్‌రెడ్డి, రావెళ్ల సీతారామయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, హుజూర్‌నగర్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చెన్న సోమయ్య పాల్గొన్నారు.