- తొలి అద్దగంట పోస్టల్ బ్యాలెట్లు.. ఆ తర్వాత ఈవీఎంలు
- మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి ఫలితం
- ముందుగా చౌటుప్పల్, చివరిగా నాంపల్లి మండలాల ఓట్ల కౌంటింగ్
- 21 టేబుళ్లు 15 రౌండ్లు
నల్గొండ / హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు బై పోల్ ఫలితం మరికొద్ది గంటల్లో వెల్లడికానుంది. మొత్తం 47 మంది బరిలో నిలువగా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నడుమ పోటీ నడిచింది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. పోలింగ్(పోస్టల్‌బ్యాలెట్ ఓట్లు కలుపుకొని) 93.41 శాతం నమోదైంది. నల్గొండలోని ఆర్జాలబావి ఎఫ్ సీఐ గోదాంలో ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌కు ఉదయం 7.30 గంటలకు అబ్జర్వర్లు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో సీల్ తొలగిస్తారు. ఇక్కడి నుంచి ఈవీఎంలను ఉదయం 8 గంటలకు ఎఫ్‌సీఐ గోదాంలోని కౌంటింగ్ హాల్‌కు తీసుకొస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. 739 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకుగాను 686 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుళ్లు ఏర్పాటు చేశారు.
8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల కౌంటింగ్..
ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్లను లెక్కిస్తామని, ఆ తర్వాత అరగంటకు అంటే ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేసి 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయిన తర్వాత, వీవీప్యాట్లలో ఉన్న స్లిప్పులు ర్యాండమ్‌గా ఐదు తప్పనిసరిగా చెక్ చేస్తామన్నారు.
298 పోలింగ్ స్టేషన్లు..
నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. చౌటుప్పల్ మండలంలో 1 నుంచి 68, సంస్థాన్ నారాయణపురం మండలంలో 69 నుంచి 122, మునుగోడు మండలంలో 123 నుంచి 141.. అదేవిధంగా 144 నుంచి 168 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. చండూరు మండలంలో 169 నుంచి 178, మళ్లీ 188 నుంచి 217 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
గట్టుప్పల్ మండలంలో 142, 143, 179 నుంచి 187తోపాటు 218 నుంచి 222, మర్రిగూడ మండలంలో 223 నుంచి 255, నాంపల్లి మండలంలో 256 నుంచి 298 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మునుగోడు, చండూరు, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ మండలాల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
మూడంచెల భద్రత
ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 250 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో వంద మంది ఓట్ల లెక్కింపు చేపడుతారు. మరో 150 మందిని ఇతర కార్యక్రమాల కోసం నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. లెక్కింపు టైంలో మూడం చెల భద్రతను ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. లోపల కేంద్ర బలగాలు, బయట రెండంచెల్లో రాష్ట్ర పోలీసుల భద్రత ఉంటుందని వివరించారు.
మొదటి రౌండ్ ఫలితం 9.15 గంటలకు..!
నియోజకవర్గంలో ఫస్ట్ పోలింగ్ స్టేషన్ చౌటుప్పల్ మండలం నుంచి మొదలవుతుంది. కాబట్టి ఓట్ల లెక్కింపు కూడా ఈ మండలం నుంచే స్టార్ట్ చేస్తారు. చౌటుప్పల్ మండలంలో మొత్తం 1 నుంచి 68 నెంబర్ వరకు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ స్టేషన్ల ఓట్లను లెక్కిస్తారు. 47 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఒక్కో రౌండ్ ఫలితం రావడానికి కనీసం అద్దగంట నుంచి 40 నిమిషాల టైం పట్టొచ్చని అధికారులు తెలిపారు. అంటే మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9.15 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. చివరిగా నాంపల్లి మండలం ఓట్లు లెక్కిస్తారు. మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ చెప్పారు.
భారీ బందోబస్తు: ఎస్పీ రెమా రాజేశ్వరి
నల్గొండ అర్బన్, వెలుగు: కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా చర్యలు తీసుకుంటు న్నట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. శనివారం కౌంటింగ్ కేంద్రం వద్ద ఎస్పీ మాట్లాడుతూ.. 470 మంది పోలీస్ సిబ్బంది మూడు కేంద్ర కంపెనీ బలగాలతో భద్రత ఏర్పాట్లు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చే అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల వాహనాల కోసం లక్ష్మీగార్డెన్స్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు ఏర్పా టు చేసిన బస్సుల్లో కౌంటింగ్ సెంటర్ వద్దకు రావాలని చెప్పారు. కౌంటింగ్ సెంటర్‌కు వచ్చే అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి జారీచేసిన గుర్తింపు కార్డులు తీసుకురావాలన్నారు.
మండలాల వారీగా పోలింగ్
మండలం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు
చౌటుప్పల్ 59,433 55,678
సంస్థాన్ నారాయణపురం 36,430 34,157
మునుగోడు 35,780 33,455
చండూరు 33,509 31,333
గట్టుప్పల్ 14,525 13,452
మర్రిగూడ 28,309 25,877
నాంపల్లి 33,819 31,240