మునుగోడు ఉప ఎన్నిక.. సెమీఫైనల్గా భావిస్తున్న ప్రధాన పార్టీలు

  • ఐదు నిమిషాల్లోనే రాజీనామా ఆమోదం

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం గన్ పార్కులో అమరుల స్తూపం వద్ద నివాళులర్పించి, అసెంబ్లీకి చేరుకున్న రాజగోపాల్ రెడ్డి.... రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. 5 నిమిషాల వ్యవధిలోనే రాజీనామాకు స్పీకర్ ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత అరగంట వ్యవధిలోనే.. మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదే విషయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈవో) రిపోర్ట్ చేశారు.

హైదరాబాద్, వెలుగు :  రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించడంతో మునుగోడుకు ఎప్పుడు ఉప ఎన్నిక జరుగుతుందనే చర్చ అన్ని పార్టీల్లో నడుస్తున్నది. ఈ ఉప ఎన్నిక రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఉప ఎన్నిక మరో రెండు మూడు నెలల్లో జరుగుతుందా..? లేక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్ లో జరుగుతుందా.. అని ఆరా తీస్తున్నాయి. 

నిబంధనల ప్రకారం ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటుకు ఖాళీ ఏర్పడితే ఆరు నెలల్లోపు కొత్త ఎమ్మెల్యేను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈలోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆగస్టు 8న మునుగోడు నోటిఫికేషన్ జారీ కావటంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 లోపు అక్కడ కొత్త ఎమ్మెల్యే కొలువుదీరాల్సి ఉంటుంది. దీంతో ఈసీ తీసుకునే నిర్ణయంపై ప్రధాన పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లో జరగాల్సి ఉంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లపై ఈసీ గత నెల రోజులుగా కసరత్తు చేస్తున్నది. అక్టోబర్ లోనే ఉప ఎన్నిక జరుగుతుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఈసారి మునుగోడు బీజేపీ అభ్యర్థిగా ఎన్నిక బరిలోకి దిగనున్నారు. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరనున్నారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీ ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మరి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి.