మునుగోడు బైపోల్ లైవ్ అప్డేట్స్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఇప్పటికీ భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు మూసివేశారు. దీంతో.. మరో రెండు గంటలపాటు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం 5గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదు అయింది. మొత్తం 2లక్షల 41వేల 805 ఓట్లకు.. ఐదు గంటల వరకు లక్షా 87వేల 527మంది ఓట్లు వేశారు.ఒకవైపు ప్రలోభాలు, మరోవైపు పోలింగ్ తో మునుగోడు అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ లో కీలకమైన చివరిగంట ఎవరికి ఓట్లు పడ్డాయో.. క్యూలైన్లలో ఉన్నవారు ఎవరికి ఓటు వేస్తారో అన్న కలవరం ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. 

ఫాంహౌజ్ వీడియోలను సీబీఐ,ఈడీలకు పంపినం: కేసీఆర్

 

ప్రజాస్వామ్య హత్య  దేశ పునాదులకే ప్రమాదని సీఎం కేసీఆర్ అన్నారు . బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో  సర్వ నాశనం చేసిందన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తనను కలిసినట్లు తప్పుడు ప్రచారం చేశారన్నారు.  ఎన్నికల అధికారులను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.  ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు. తాను చాలా బాధతో ఇవాళ మీడియా సమావేశ పెట్టానని కేసీఆర్ అన్నారు. ఫాంహౌజ్  వీడియోలను సీబీఐ, ఈడీలకు పంపించామన్నారు.  అన్ని రాష్ట్రాల సీఎంలకు, సుప్రీం కోర్టుకు కూడా పంపిస్తామన్నారు.

మునుగోడులో 1000 కోట్లు ఖుర్చు పెట్టిన్రు

నెల రోజులు విచ్చలవిడిగా  డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఓటర్లకు డబ్బు పంచడానికి టార్గెట్ పెట్టారని చెప్పారు. భవిష్యత్ లో తమకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయో రావో అనే భయంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సొంతంగా రూ.1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్, పోలీస్ వాహనాల్లోనే టీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేశారని, వారికి పోలీసులు సహకరించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు డబ్బు పంచుతున్నారని కంప్లైంట్ ఇస్తే ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విమర్శించారు. డబ్బు పంచిన వారిలో మొత్తం 42 మందే దొరికారని ఎన్నికల అధికారులు చెబుతున్నారని అన్నారు.

క్యూ లైన్ లో ఉంటే ఎంత రాత్రైనా ఓటేయొచ్చు

క్యూలైన్ లో ఉన్నవారు ఎంత రాత్రైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కొన్ని చోట్ల గొడవలు జరిగాయని.. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పారు. మాక్ పోల్ తర్వాత మూడు చోట్ల మాత్రమే ఈవీఎంలు మోరాయించాయని అన్నారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్‭కు తరలిస్తామని చెప్పారు. కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లకు ట్రైనింగ్ ఇచ్చామని ఆయన అన్నారు. ఈ నెల 6న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.  

పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్ లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నామని వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పుడు ఎవరైనా వస్తే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వవద్దని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఈవీఎంలు మోరాయిస్తే.. వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేస్తామని వికాస్ రాజ్ వెల్లడించారు. ఇక ఇప్పటివరకు 6వేల 100 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. మొత్తం 191 ఎఫ్ఐఆర్‭లు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు.ఇప్పటివరకు8.26 కోట్ల మెటీరియల్, డబ్బులు సీజ్ అయ్యాయని వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఇవాళ ఒక్కరోజులో మరో 98 ఫిర్యాదులు అందాయని చెప్పారు. 

ముగిసిన పోలింగ్ సమయం..క్యూ లైన్లో ఓటర్లు

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఇప్పటికీ భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

చండూరులో ఉద్రిక్తత

చండూరులో ఉద్రిక్తత నెలకొంది. జడ్పీ హైస్కూలో లో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు  టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. అయితే కూసుకుంట్ల ప్రచారం చేస్తున్నాడంటూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూసుకుంట్ల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కూసుకుంట్లను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.

మీడియాపై పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ఓ మీడియా ప్రతినిధిని పోలీసులు నెట్టేశారు. దీంతో మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మీడియా ప్రతినిధులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

సా. 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్

మునుగోడు బైపోల్ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 77.55  శాతం పోలింగ్ నమోదయ్యింది. ఓటు వేసేందుకు  మరో గంట సమయం ఉంది. సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

శివన్నగూడెంలో ఉద్రిక్తత..రాజగోపాల్ పై దాడికి యత్నం

మర్రిగూడెం మండలం శివన్న గూడెంలో  ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డిని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న రాజగోపాల్ ను.. నువ్వు దేనికి వచ్చావ్ అంటూ ఆయనపై దాడికి యత్నించారు. పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. వెంటనే రాజగోపాల్ ను పోలింగ్ కేంద్రం నుంచి బయటక పంపారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది

చండూరులో TRS, BJP కార్యకర్తల మధ్య గొడవ

చండూరులో TRS, BJP కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. నాన్ లోకల్ వాళ్లు డబ్బులు పంచుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో రెండుపార్టీల మధ్య వాగ్వాదం మొదలైంది. పోలీసులు ఎంటరై లాఠీచార్జ్ చేశారు. విషయం తెలసుకున్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్పాట్ కు చేరుకున్నారు. నాన్ లోకల్స్ వాళ్లను పట్టుకుని పట్టించినా.. పోలీసులు వదిలేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. డబ్బులు పంచుతున్నా కూడా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 మంత్రి ఇంచార్జ్ గా ఉన్న గ్రామంలో  మద్యం, డబ్బు పట్టివేత

మునుగోడు ఉప ఎన్నికలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామంలోని బీసీ కాలనీ వద్ద మద్యం, నగదు పట్టుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాటిని పోలీసులకు అప్పగించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న ఈ  గ్రామంలో మద్యం బాటిళ్లు, నగదు పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది..

 

సంస్థాన్ నారాయణ్ పూర్ లో మొరాయిస్తున్న ఈవీఎంలు

మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం జడ్పీ పాఠశాలలో ని 94,96 పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఓ వైపు  ఓటర్లు భారీగా బారులు తీరారు. గంటల తరబడి లైన్లల్లో నిలబడాల్సి వస్తోందని ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్

మునుగోడు బైపోల్ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఓటు వేసేందుకు  మరో మూడు గంటల సమయం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారిని  పోలింగ్ కు అనుమతిస్తారు.   

మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో నెమ్మదిగా పోలింగ్

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో పోలింగ్ మందకొండిగా కొనసాగుతోంది. శివన్నగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఎక్కువగా ఉండటంతో.. ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు  డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ఎన్నికను బహిష్కరించిన రంగం తండా వాసులు

గట్టుప్పల్ మండలం రంగం తండాలో  గ్రామస్తులు ఎన్నికను బహిష్కరించారు. గ్రామంలో మౌలిక వసతులు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఓటు వేయమని  గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం  దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తండా వాసులు చెబుతున్నారు. తండాలో మొత్తం 320 ఓట్లు ఉన్నాయి.

మధ్యాహ్నం ఒంటి గంటకు 41.30శాతం పోలింగ్

మునుగోడు ఉప ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. ఉదయం కాస్త మందకొడిగా సాగినా 11గంటకల్లా పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్ల క్యూ భారీగా పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 41.30శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఒంటి గంట వరకు 99 వేల 780 మంది ఓటు వేశారు

పోలింగ్ సరళిని పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు

మునుగోడులో పోలింగ్ సరళిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. నారాయణపురంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పోలింగ్ ను పరిశీలించారు. మరోవైపు పలివెల సహా పలు పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. 

మద్యం, గులాబీ జెండాలను రోడ్డుపై ఉంచి ఆందోళన

దామెరభీమపల్లిలో టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పలు వాహనాల్లో మద్యం, డబ్బులు పంపిణీ చేస్తుండగా కొందరు స్థానికులు వారిని పట్టుకున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడిన మద్యం, గులాబీ జెండాలను రోడ్డుపై పెట్టి ఆందోళన చేశారు.

కారులో రూ.10లక్షలు ఎవరివి..? 

మునుగోడు నియోజకవర్గంలోని భీమనపల్లి గ్రామంలో నంబర్ ప్లేట్ లేని ఒక కారులో 10 లక్షల నగదు పట్టుబడింది. నగదు దొరికిన కారుపై ఎంపీ స్టిక్కర్ ఉంది. అయితే.. ఈ కారు ఎవరిది అనే దానిపై విచారణ సాగుతోంది. 

పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. చౌటప్పల్ మండలం చిన్నకొండూరులో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కు బ్రేక్ పడింది. దీంతో ఓటర్లు క్యూలో పడిగాపులు కాస్తున్నారు. మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రం దగ్గర పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. క్యూలో నిలబడలేక కొందరు మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాల ముందే సేద తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సంస్ధాన్ నారాయణపురం మండలం అల్లందేవి చేరువులో కూడా పోలింగ్ నిలిచిపోయింది. అక్కడ కూడా ఈవీఎంలు మొరాయించాయి.

కొండాపూర్లో నిలిచిపోయిన ఓటింగ్

మనుగోడు నియోజకవర్గంలోని కొండాపూర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పోలింగ్ ఆగిపోయింది. దీంతో భారీ సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.

ఓటేసేందుకు గంటన్నర

యాద్రాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం జనగాంలో పోలింగ్ స్లోగా సాగుతోంది. దీంతో భారీ క్యూ ఏర్పడింది. ఓటేసేందుకు జనం క్యూలో పడిగాపులు పడుతున్నారు. లైన్లో ఉన్న వారి వంతు వచ్చేందుకు గంటన్నర టైం పడుతుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు నిల్చోలేక పోలింగ్ కేంద్రాల దగ్గర కూర్చుండిపోతున్నారు.

11 గంటల నాటికి 25.8 శాతం పోలింగ్‌

మునుగోడులో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ క్రమంగా పుంజుకుంటోంది. ఉదయం 11 నాటికి 25.8 శాతం ఓటింగ్‌ నమోదైందని అధికారులు వెల్లడించారు.

కొంపల్లి గ్రామంలో పిల్లలతో టీఆర్ఎస్ ప్రచారం

మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర టీఆర్ఎస్ నేతలు చిన్నారులతో ప్రచారం చేయిస్తున్నారు. చేతిలో టీఆర్ఎస్ గుర్తుకు సంబంధించిన ప్లకార్డులతో ప్రచారం నిర్వహిస్తున్నారు. బూత్ దగ్గరికి వచ్చే ఓటర్లకు కారు గుర్తుకే ఓటు వేయాలని సూచించేలా పిల్లల చేతుల్లో ప్లకార్డులు పెట్టారు.

పోలింగ్ కేంద్రాల పరిశీలన

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మునుగోడు మండలం పలివెల గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా తప్పిదాలు జరగకుండా తనిఖీలు చేశారు. EVMలు ఎలా పని చేస్తున్నాయో ఎన్నికల సిబ్బందిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 

మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్ : రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందని బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడుకు ప్రజలకు కావాల్సింది అభివృద్ధినేనని అన్నారు.  టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఓటర్లు ధర్మం వైపు నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం ముగిసినా మంత్రులు బయటకు వెళ్లిపోకుండా ఇక్కడే ఉన్నారని,  డబ్బు, మద్యం పంచిపెడతున్నారని  ఆరోపించారు.

చండూరులో సిరిసిల్ల జెడ్పీ వైస్ ఛైర్మన్

మునుగోడు బైపోల్లో ప్రలోభాలు, ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. విచ్చలవిడిగా డబ్బు, లిక్కర్ పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. సిరిసిల్లా జెడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు చండూరులో ఉన్నట్లు గుర్తించారు. 

మునుగోడులో ఆగని ప్రలోభాలు

మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం టీపీ గౌరారంలో టీఆర్ఎస్ ప్రలోభాలకు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బున్న ఓ వాహనాన్ని అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ వాహనం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి అనుచరులదిగా అనుమానిస్తున్నారు. ఈ వాహనంలో నోట్ల కట్టలతో పాటు టీఆర్ఎస్ పార్టీ జెండాలు ఉన్నాయి. 

పైసలియ్యందే ఓటేయమంటున్న నాంపల్లి ఓటర్లు

పైసలియ్యందే ఓట్లెయ్యమని నాంపల్లి ఓటర్లు తెగేసి చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. పక్క కాలనీల్లో డబ్బులిచ్చి తమకెందుకు ఇవ్వరని స్థానిక నేతలను నిలదీస్తున్నారు. 

ఓటమి భయంతో దిగజారి వ్యవహరిస్తున్రు : రేవంత్ రెడ్డి

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. పాల్వాయి స్రవంతి ఫొటోను మార్ఫింగ్ చేసి కేసీఆర్ తో భేటీ అయ్యారంటూ బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

బండి సంజయ్ హౌస్ అరెస్ట్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ను పోలీసులు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి మునుగోడుకు వెళ్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ నుంచి పార్టీ ఆఫీసుకు తీసుకొచ్చారు. బండి అక్కడ నుంచే మునుగోడు ఎన్నికల పోలింగ్ సరళి, జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారు. టీఆర్ఎస్ దాడులు, ప్రలోభాలకు గురికాకుండా  ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. 

చండూరులో స్థానికేతరులు..

చండూరు మండల కేంద్రంలోని ఓ ఇంట్లో కరీంనగర్కు చెందిన టీఆర్ఎస్ నేతల మకాం వేశారు. స్థానిక బీజేపీ నేతలు వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పరారయ్యారు. ఆ ఇంట్లో కరీంనగర్ టీఆర్ఎస్ నేతల ఆధార్ కార్డులు దొరికినట్లు తెలుస్తోంది. 

మర్రిగూడ మండల కేంద్రంలో ఉద్రిక్తత

మర్రిగూడ మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మెదక్, సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఓటర్లను ఇతర జిల్లాల టీఆర్ఎస్  కార్యకర్తలు ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు. వారి వాహనాలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీజేపీ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జి చేశారు.

వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితి గమనిస్తున్నం : సీఈఓ వికాస్ రాజ్

మునుగోడులోని 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. 2 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం బ్యాటరీల్లో సమస్య తలెత్తగా వాటిని సరిచేసినట్లు చెప్పారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తున్నట్లు చెప్పారు. మునుగోడులో నాన్ లోకల్స్ ఉన్నట్లు ఫిర్యాదు అందడంతో రెండు గ్రామాల్లో వారి నుంచి డబ్బు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వికాస్ రాజ్ చెప్పారు.

ఫేక్ న్యూస్పై ఈసీకి పాల్వాయి స్రవంతి ఫిర్యాదు

సీఎం కేసీఆర్ను కలిసానని తనపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈసీ కి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని అందులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాల్వాయి స్రవంతి ఎన్నికల అధికారులను కోరారు.

ఇడికుడలో ఓటేసిన పాల్వాయి స్రవంతి

చండూరు మండలం ఇడికుడ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత చండూరులో పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రస్తుతానికి ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. 

ఓటు హక్కు వినియోగించుకున్న కూసుకుంట్ల

నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమన్నారు. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

మొరాయించిన ఈవీఎం

మునుగోడులోని 164వ నెంబర్ బూత్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమైందని అధికారులు చెప్పారు. 

బుద్ధ భవన్ నుంచి ఓటింగ్ సరళి పరిశీలన

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ను అధికారులు హైదరాబాద్ బుద్ధ భవన్ సీఈఓ సెంట్రల్ ఆఫీస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే దగ్గర ఒక్కరి కన్నా ఎక్కువ మంది ఉన్న సెంటర్లను గుర్తించి పోలింగ్ బూత్ అధికారులను అలర్ట్ చేస్తున్నారు. మునుగోడు టౌన్లోని ఓ పోలింగ్ స్టేషన్లో జనం గుమికూడడంతో పీఓను అలెర్ట్ చేసిన అధికారులు వారిని అక్కడ నుంచి పంపించాలని ఆదేశించారు.

టీఆర్ఎస్ దాడులు, బెదిరింపులు పెరిగాయి: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. టీఆర్ఎస్ దాడులు, బెదిరింపులు పెరిగాయని ఆయన ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లను సైతం బెదిరిస్తున్నారని రాజగోపాల్ మండిపడ్డారు.

నాన్ లోకల్స్ ను పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు

నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్ హాల్ లో నాన్ లోకల్స్ ఉన్నట్లు ఎలక్షన్ అబ్జర్వర్స్ గుర్తించారు. సోదాలు నిర్వహించి వారి నుంచి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో లింగొజిగుడెంలో స్థానికేతరులు ఉన్నట్లు గుర్తించిన బీజేపీ కార్యకర్తలు వారిని పట్టుకున్నారు.

పోలీసుల అదుపులో బండి సంజయ్

మునుగోడులో ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్న సమాచారంతో అర్థరాత్రి ఒంటి గంట సమయంలో మునుగోడుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు ముసారాంబాగ్ చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ శ్రేణులు నినాదాలు చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ లోపు పోలీసు వలయం దాటుకుని వెళ్లిన బండి సంజయ్ కాన్వాయ్ ను వనస్థలిపురంలో అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అది సాధ్యంకాకపోవడంతో రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద కాన్వాయ్ ను అడ్డుకుని బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా ఆయన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు.