నల్గొండ : మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అధికారులు చండూర్లోని డాన్ బాస్కో జూనియర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది అక్కడకు వచ్చి పోలింగ్ సామాగ్రిని తీసుకుంటున్నారు. మెటీరియల్ తీసుకున్న అనంతరం కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వారిని పంపనున్నారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీల విషయానికొస్తే బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. మునుగోడు పరిధిలో 2,41,855మంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడులో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 3,366 మంది పోలీస్ సిబ్బందితో పాటు.. 15 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాటు చేశారు. మునుగోడులో ఇప్పటికే ఓటర్ స్లిప్పులను పంపిణీ పూర్తికాగా.. ఎలక్షన్ కమిషన్ ఆన్ లైన్లోనూ వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.