మునుగోడు: కేసీఆర్ అవినీతి పాలనను బీజేపీ అంతమొందిస్తుందని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తరఫున మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై వివేక్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం స్కాంలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణి, లిక్కర్ స్కాంలలో టీఆర్ఎస్ ప్రభుత్వం మునిగి తేలుతోందని విమర్శించారు. ప్రతి పథకంలో అవినీతికి పాల్పడుతూ చంద్రశేఖర్ రావు కాస్త కమీషన్ రావుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు ప్రజల సమస్యలతో పని లేదని, ఆయన ఎప్పుడూ ఫాంహౌజ్ లోనే ఉంటారని ఆరోపించారు.
కొడకు కేటీఆర్, కూతురు కవితకు ఫాంహౌజ్ లు కట్టించడానికి చేతనైతది గానీ.. ప్రజలకు ఇండ్లు కట్టించడం మాత్రం కేసీఆర్ కు చేతగాదని ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ పాలనను గద్దె దించడానికి ప్రజలకు వచ్చిన మంచి అవకాశం అని, రాజగోపాల్ రెడ్డిని గెలిపించి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.