మునుగోడు ఉప ఎన్నిక అనేక చర్చలకు అవకాశం ఇచ్చింది: కూనంనేని

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక అనేక చర్చలకు అవకాశం కల్పించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్నికలు, వ్యవస్థ భ్రష్టుపట్టిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోజుల్లో గజిని మహ్మమద్  లా ప్రధాని మోడీ, అమిత్ షా  రాష్ట్రాల మీదకు దండ యాత్రలు చేస్తున్నారని,  డబ్బులతో ఎమ్మెల్యే లను కొనుగోలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

మునుగోడు మండల కేంద్రంలో సీపీఐ నియోజకవర్గ స్థాయి మండల కౌన్సిల్ సభ్యుల సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్ రెడ్డి, నెల్లికంటి సత్యం, యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు తదితరులు హాజరయ్యారు. ముఖ్య వక్తగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర, దేశ రాజకీయాలు, పాలనా వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు.  

‘‘బీజేపీ పార్టీ దుష్ట ఆలోచనతో రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం.. వారితో రాజీనామా చేయించి  తద్వారా ఉప ఎన్నిక తీసుకురావడం.. ఈడీ దాడులతో బెదిరింపులకు పాల్పడి రాజకీయాలు చేస్తోంది..’’ అని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వ్యవస్థ  సర్వ నాశనం అయిందన్నారు. సిట్ ద్వారా విచారణ చేయొద్దు అని చెప్పడానికి బీజేపీకి ఏమి సంబంధం.. మత పీఠాధిపతులను రాజకీయాలోకి  ఎందుకు దింపుతున్నారు..? అని ప్రశ్నించారు.

 ప్రధాని హోదాలో ఉండి అబద్దాలు చెప్పరాదన్నారు. దేశంలో ఇప్పటికే 80 శాతం కంపెనీలను అదాని, అంబానీలకు కట్టబెట్టారని ఆరోపించారు. కరోనా కంటే ఎక్కువ ప్రమాదకరమైన బీజేపీ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెప్పారని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.