మునుగోడు కోసం లీడర్లను కొంటుండు

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం కేసీఆర్ ఎప్పటిలాగే ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నరని విమర్శించారు. ఎంపీటీసీలను కొనుగోలు చేసి మునుగోడులో గెలవాలని దుర్మార్గమైన రాజకీయాలకు ఒడిగడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు పోరాట చరిత్ర ఉందన్న రేవంత్ రెడ్డి.. ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి ఎంతో మంది పోరాట యోధులు ఈ ప్రాంతంలో ఉన్నారని అన్నారు.  

రాజీవ్ గాంధీ జయంతి రోజున మునుగోడుకు వెళ్లనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 20వ తేదీ నుంచి ఆ ప్రాంత ప్రజల మధ్య ఉంటానని తెలిపారు. 8 ఏళ్లుగా కాంగ్రెస్ శ్రేణులు ఎంతో కష్టపడి, కొట్లాడి నష్టపోయారని రేవంత్ వాపోయారు. అధికారంలోకి వచ్చే సమయంలో చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామని రేవంత్ అభిప్రాయపడ్డారు. అందరూ కలిసి నిలబడి మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పినట్లు అవుతుందని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కలిసికట్టుగా పోరాటం చేసి మునుగోడులో విజయం సాధిద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.