మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన రాజగోపాల్ రెడ్డి చండూర్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, రాజ్ గోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు.
మరో వైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సైతం ఈ రోజు మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నారు. అనుచరులతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి నామినేషన్ వేయనున్నారు.
దేశ భవిష్యత్తును నిర్ణయించేది మునుగోడు ఉప ఎన్నికే
తన రాజీనామా మునుగోడు ప్రజల కోసమేనని... నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నామినేషన్ దాఖలుకు బయల్దేరే ముందు V6 మీడియా ప్రతినిధితో తో మాట్లాడిన ఆయన తనకు దేవుడంటే నమ్మకమని.. ఆ దేవుడే ధర్మాన్ని గెలిపిస్తాడన్నారు. మునుగోడు ప్రజలు న్యాయం వైపే ఉంటారని అన్నారు. కేసీఆర్ వెంట ఉన్న వాళ్లంతా కూడా తెలంగాణ ద్రోహులేనన్న ఆయన... తెలంగాణ కోసం పోరాడిన వాళ్లకు రాష్ట్రంలో సముచిత స్థానం లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలనేవి రాష్ట్ర, దేశ భవిష్యత్తుని నిర్ణయించేవని చెప్పారు.
ఓటమి భయంతో టీఆర్ఎస్ కౌరవ సైన్యాన్ని దింపింది
మునుగోడు ప్రజలు అత్యంత చైతన్యవంతులని... ధర్మం వైపు నిలబడతారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓటమి భయంతో కౌరవ సైన్యాన్ని దింపిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా డబ్బుల సంచులతో ప్రజల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటమి భయంతో మునుగోడులో లెంకలపల్లి గ్రామంని తీసుకొని కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యాడని చెప్పారు. ప్రాజెక్టులు, కాంట్రాక్టుల పేరుతో దోచుకునే డబ్బునే ప్రజలకు పంచి పెడుతున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులను తీసుకుంటారు కానీ వాళ్ళ ఓటు మాత్రం తనకే వేస్తారన్న నమ్మకం ఉందన్నారు.