మునుగోడు, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో 500 రోజుల్లో అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఫండ్స్‌తో నియోజకవర్గ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. బుధవారం మునుగోడులోని క్యాంపు ఆఫీసులో ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో పార్టీ మ్యానిఫెస్టో ను మీడియాకు విడుదల చేశారు. కొన్నేండ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మునుగోడు ప్రాంతం రూపురేఖలను 500 రోజుల్లో మారుస్తానని, అందుకు తగ్గట్టుగా రూ.625 కోట్లతో పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు.
తెలంగాణ తెచ్చుకున్నది ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు, పిల్లలకు మంచి చదువు, వైద్యం కోసం మంచి దవాఖానా, ఉపాధి, ఉద్యోగాల కోసమే కానీ.. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాల కోసం కాదన్నారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో రోడ్లు బాగు చేయడంతోపాటు, మహిళలు, నిరుద్యోగులు, గిరిజనులు, కార్మికులు, చేనేత కార్మికులు, ఇలా అన్ని వర్గాల వారి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మునుగోడు నియోజకవర్గంలో వంద శాతం అమలయ్యేలా చర్యలు చేపట్టడమేగాక, సాగు, తాగునీటి రంగంలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా రూ.100కోట్లతో మూసీనది నీళ్లను ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించి చౌటుప్పుల్ మండలంలోని చెరువులు నింపుతామని ప్రకటించారు.
పీఎం ఆవాస్ యోజన ద్వారా డబుల్ బెడ్రూం ఇండ్లు
ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, తాము ప్రచారానికి వెళ్లినప్పుడు డబుల్బెడ్రూం ఇండ్ల గురించి పబ్లిక్ అడుగుతున్నారని, తాము గెలిచాక ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మహిళలకు, యువకులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ముద్ర లోన్స్ ఇప్పిస్తామన్నారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే పథకాలు రద్దవుతాయని మంత్రి జగదీశ్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంతకుముందు వడ్లు కొనను అన్నప్పుడు కూడా సీఎం కేసీఆర్ మెడలు వంచి కొనిపించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే లు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, బొడిగ శోభ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
కేంద్ర రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన నిధులద్వారా రూ.200 కోట్లతో మునుగోడుకు నియోజకవర్గంలోని నారాయణ పురం నుంచి శివన్న గూడెం వరకు (వయా వాయిళ్లపల్లి) ఒక రోడ్డు , పుట్టపాక నుంచి బంగారిగడ్డ వరకు (వయా గట్టుప్పుల) రెండు మండల కేంద్రాలను కలుపుతూ ఒక రోడ్డు, నాంపల్లి నుంచి బంగారిగడ్డ వరకు రెండు మండల కేంద్రాలను కలుపు తూ మరో రోడ్డు.. మొత్తంగా మూడు డబుల్రోడ్లను నిర్మిస్తాం. చేనేత కార్మికుల ఉపాధి కోసం కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల పె ట్టుబడితో నారాయణపూర్ మండల కేంద్రంలో టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు.
ఫ్లోరైడ్ బాధితుల కోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో మునుగోడులో రూ.100 కోట్ల తో వంద పడకలతో రీసెర్స్ సెంటర్ కమ్హాస్పిటల్ నిర్మాణం.
కేంద్రం ద్వారా రూ.25 కోట్లతో చౌటప్పుల్ పట్టణంలో ఆధునిక హంగులతో ఐటీఐ ఏర్పాటు. మర్రిగూడలో కేంద్ర విద్యాశాఖ ద్వారా నవోదయ పాఠశాల నిర్మాణం. సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద రూ.100 కోట్లతో చౌటుప్పల్ మండలంలో మూసీనదిపై ఎత్తిపోతల స్కీం ఏర్పాటు. మునుగోడు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉపాధి క ల్పించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం దేశ వ్యాప్తంగా వివిధ ప్రైవేటు రంగ కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరిపి..నారాయణపూర్, చౌటుప్పుల్, చండూరు మండల కేంద్రాలలో వంద రోజుల్లో మెగా ఉద్యోగ మేళాల నిర్వహణ.
ఏటా వెయ్యి మందికి ఉపాధి. పట్టణ ప్రాంతాల్లోని వీధివ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 వేల రుణం స్వానిధి పథకం కింద మంజూరు. చేనేత కార్మికులు, ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేసే కార్మికుల కోసం చౌటుప్పుల్ పట్టణంలో 10 పడకలతో కూడిన ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు.రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి. అన్ని మండల కేంద్రాల్లో అవసరం మేరకు జాతీయ బ్యాంకు శాఖల ఏర్పాటు. చౌటుప్పుల్ మండల కేంద్రంలో నోడల్ బ్యాంకు. చండూరు, చౌటుప్పుల్, పట్టణాల్లో రెండేసి, మండల కేంద్రాల్లో ఒకటి చొప్పున పీఎం శ్రీ పాఠశాలల ఏర్పాటు. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ట్రైఫెడ్ శాఖ. చండూరు, చౌటుప్పుల్ టౌన్లలో ఎంఈఐటీవై ఎల క్ట్రానిక్ సెంటర్స్ ద్వారా ఐటీ అభివృద్ధి. ఖేలో ఇండియా స్కీం ద్వారా చౌటుప్పుల్ రూ.100 కోట్లతో అత్యాధునిక క్రీడా మైదానం ఏర్పాటు.