మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. దీంతో మరో రెండు గంటలపాటు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం 5గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదు అయింది. మొత్తం 2లక్షల 41వేల 805 ఓట్లకు.. ఐదు గంటల వరకు లక్షా 87వేల 527మంది ఓట్లు వేశారు.
ఉదయం పోలింగ్ కాస్త మందగించినా..మధ్యాహ్నం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5గంటల లోపు దాదాపు 40శాతం పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం తర్వాత మహిళలు, యువత పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో.. పోలింగ్ లేట్ అయింది. అయినా ఓటర్లు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల్లో వెయిట్ చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చివరి రెండు గంటల్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
ప్రధానంగా చౌటుప్పల్, చండూరు, మర్రిగూడ, సంస్థాన్ నారాయణపురం మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లున్నాయి. నాంపల్లి మండలం వడ్డేపల్లిలో ఉదయం నుంచి ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. నాంపల్లి మండలం పెద్దాపురం పోలింగ్ కేంద్రంలో క్యూలో ఉన్న 150మందికి టోకెన్లు ఇచ్చారు. నారాయణపురం మండల కేంద్రంలోని 93, 94 పోలింగ్ కేంద్రాలలో పోలీసులకు -ఓటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.