‘‘ఓ నక్క ప్రమాణస్వీకారం చేసిందట ఇంకెవర్నీ మోసగించనని,
ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట,
తోటి జంతువుల్ని సంహరించనని,
ఈ కట్టుకథ విని.. గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి’’ అంటాడు అలిశెట్టి ప్రభాకర్.
ము నుగోడు ఎన్నిక ముగిసింది. కురిసి కురిసి వాన వెలిసినట్టయింది. పోలింగ్ ముగిసి, ఓటర్ నిర్ణయం ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) లోకి చేరింది. ఓట్లు లెక్కించి, 6న ఫలితాలు ప్రకటిస్తే ఎవరో ఒకరు గెలుస్తారు. ఎందుకంటే, అంకెలే కదా మనకు ప్రామాణికం! కానీ, ఓడేది మాత్రం ప్రజలు, ప్రజాస్వామ్యం. ఇంతటి ఘోరమైన ఎన్నిక ఇటీవలి కాలంలో మనమెప్పుడూ చూసి ఉండం. సుమారు రెండున్నర లక్షల ఓటర్ల సాక్షిగా జరిగింది ప్రజాస్వామ్య పరిహాసం, హననం!
ఒక ఎన్నిక ఎన్నో అంశాలు, మరెన్నో ప్రభావాలు. మునుగోడు మనకు నేర్పే పాఠం ఏమిటి? అని నేను అడగటం లేదు, కారణం.. మనం దేని నుంచి పాఠం నేర్చుకున్నాం గనుక! కనీసం, మునుగోడు ఎన్నికల ప్రహసనం లేవనెత్తుతున్న పలు సందేహాల్ని, ప్రశ్నల్ని ప్రస్తావిస్తా? సమాధానం దొరుకుతుందేమో ఆలోచిద్దాం. ఎవరో ఒకరు, ఎక్కడో ఒకచోట, ఎందుకో ఒకందుకు ప్రశ్నించకుంటే.. అన్నీ సజావుగా ఉన్నాయని, అంతా జనామోదమే అని మన పాలకులు చంకలు గుద్దుకునే, జబ్బలు చరుచుకునే ప్రమాదం ఉంది కనుక, ఈ సమీక్ష తప్పదు.
అందర్నీ వదిలి, చివరకు ప్రజలనే తప్పుబట్టే నయావిశ్లేషకులు బయలుదేరారు. ఎవరి పేరు చెప్పి ప్రజాస్వామ్య పాలనను ఏర్పరచుకున్నామో, ఎలాంటి వ్యవస్థల్ని రూపొందించుకున్నామో, ఏయే కట్టుబాట్లను రచించుకున్నామో.. అవేవీ పాటించకుండా, అసలు పనిచేయకుండా పోయి, సగటు మనిషే లక్ష్యంగా మూకుమ్మడి దాడి జరిగినప్పుడు అన్ని విధాలా అశక్తులైన పౌరులు విధిలేక నడుస్తున్న ముళ్లదారినీ చూస్తున్నాం. అందుకు కారణాలు ఎత్తిచూపకుండా, బాధ్యుల్ని గుర్తించకుండా.. ఆ దారిన నడుస్తున్న వారినే తప్పుబడితే ఎలా?
రాజ్యాంగ సవరణ అవసరమేమో!
ఎందుకీ ఎన్నిక వచ్చింది? ఏడాది ముంగిట్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలుండగా ఇప్పుడీ ఎన్నిక అవసరమా? మరి, ఇంతగా ప్రజాధనం వెచ్చించి జరిపిన ఈ ఎన్నిక తేల్చేదేమిటి? 1192 ఈవీఎంలను తరలించి, 298 పోలింగ్ స్టేషన్లను సమాయత్తపరచి, 2500 మంది పోలింగ్ సిబ్బంది, 5000 మంది కేంద్ర–రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించి, వందకు పైగా ప్రత్యేక చెక్‌పోస్టులు పెట్టి సాధించేదేమిటి?
ఎన్నిక నిర్వహణకు వెచ్చించిన ప్రతి పైసా జనం పన్నులు కడితే నిండిన ఖజానా నుంచే! ఈ పోటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక, విపక్ష పార్టీలు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేసి, వందల కోట్ల రూపాయల ‘పెద్ద పెట్టుబడి’ పెట్టాయి. తిరిగి జనం నుంచే ఏదో రూపంలో రాబట్టుకోకుండా ఉంటాయా? అప్పుడు నికర నష్టం ఎవరికి? తన ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి ఉప ఎన్నికను రప్పించిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చెప్పేదేమిటి?
మూడున్నరేళ్లయినా తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదని, ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని, దానికి గుణపాఠం చెప్పి పరిస్థితిలో మార్పు తెచ్చేందుకే తాను రాజీనామా చేశానని వివరించారు. ఒక నియోజకవర్గంలో అభివృద్ధికి ఎమ్మెల్యే రాజీనామా – ఉప ఎన్నికే మార్గమా? దాన్ని నిజమనిపించేలా ప్రభుత్వం కూడా.. ఎన్నిక అనివార్యమైన నుంచి ఇక్కడ అభివృద్ధి పనుల్ని ముమ్మరం చేసింది.
సంక్షేమ పథకాలను అమలుపరచడం, పెండింగ్ పనుల్ని వేగిరపరచి నిధులు విడుదల చేయడం తప్పుడు సంకేతాలిచ్చింది. దాంతో, మా నియోజకవర్గానికి ఉప ఎన్నికంటే, మాకు ఉప ఎన్నిక కావాలని ఎక్కడికక్కడ జనం తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి పెంచే పరిస్థితి వచ్చింది. ఇదేమైనా బాగుందా? ఇదా ప్రజాస్వామ్య స్ఫూర్తి! ఇదంతా కాదు, కాంట్రాక్టు పని కోసం బీజేపీ నాయకత్వం పిలుపు మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, జనంపై ఉప ఎన్నిక రుద్దారని, అందుకే పార్టీ మారారని ప్రత్యర్థి పక్షం విమర్శించింది.
దేంట్లో ఎంత నిజముందో పక్కన పెడితే, జనం మాత్రం వంచనకు గురయ్యారు. ఒక నియోజకవర్గం ఖాళీ అవడం, సాధారణ ఎన్నికలకు ఆరు మాసాల ముందయితే, ఎన్నిక జరిపించడం – మానడమనే నిర్ణయాధికారం ఎన్నికల కమిషన్(ఈసీ) పరిధిలోకి వస్తుంది. ఇది ఇప్పుడున్న విధానం. ఏడాది లోపలైనా, హేతుబద్ధమైన కారణం లేకున్నా నిర్ణయించే అధికారం కమిషన్‌కు ఉండేలా మన రాజ్యాంగాన్ని ఏమైనా సవరించుకోవాలా? అనే ప్రశ్న ఇపుడు ఉత్పన్నమవుతున్నది.
ఎవరికి బదులు, ఎవరి నమ్మకం పెరిగింది!
వచ్చే సాధారణ ఎన్నికలకు ఇది దిక్సూచి అని జరిగిన ప్రచారమే కొంప ముంచింది. ఫలితాన్ని జీవన్మరణ సమస్యగా తీసుకున్న ప్రధాన ప్రత్యర్థి పార్టీలు అన్ని కట్టుబాట్లనూ ఉల్లంఘించి, నిస్సిగ్గుగా వ్యవహరించాయి. ఓటుకు మూడు వేల నుంచి 20 వేల దాకా పంచారనే ప్రచారం పోలింగ్ ముందు రోజు ఊపందుకుంది. దాంతో, మాకెందుకు ఇవ్వరు? అని అక్కడక్కడ జనం గుంపులుగా పార్టీల వారిని డిమాండ్ చేసే పరిస్థితి తలెత్తింది.
దీన్నే పౌర సమాజంలోని కొందరు తప్పుబడుతున్నారు. ఓటర్లే సిగ్గువిడిచి తమ వాటాగా, ‘ఓటుకింత రావాలని డిమాండ్ చేయడమేమిట’ని వారు విమర్శిస్తున్నారు. ఇక్కడొక కీలకాంశం ఉంది. ప్రజలు తామెదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పోరాటం చేసినపుడు, ఏ పౌరసమాజం వారికి దన్నుగా నిలవలేదు. రెండు రిజర్వాయర్ల వల్ల నిర్వాసితులౌతున్న శివన్నగూడెం పరిధి అరడజన్ గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు.
59 రోజులు దీక్షలు జరిపిన వారు, ఎన్నికల సందర్భంగానైనా తమకు నిర్దిష్ట పునరావాస ప్యాకేజీనో, నష్టపరిహారమో లభిస్తుందని ఆశించి భంగపోయారు. మునుగోడులో చేనేతలు ఈ ఎన్నిక తమకు ఎంతో కొంత వెలుగు తెస్తుందని నమ్మి, ఏదీ లేక చివరకు మోసపోయారు. నిజమైన సమస్యల్ని గాలికి వదిలిన పాలకపక్షాలు తమ పబ్బం గడుపుకోవడానికి గాలి మేడల హామీలిచ్చాయి. మద్యం, డబ్బు పంపిణీ చేశాయి.. అదైనా తీసుకుంటే తప్పేమిటని జనం ప్రశ్నిస్తున్నారు.
కష్టాల్లో తమతో కలిసి రాని, తమ పోరాటాలకు మద్దతీయని మేధావులకు ఇప్పుడు తమను ప్రశ్నించే నైతిక హక్కు లేదని వారంటున్నారు. భౌగోళికంగా నియోజకవర్గం ఒక యూనిట్ అయినప్పటికీ, నిర్దిష్టమైన అభివృద్ధి నమూనా లేదు, ప్రమాణాలు లేవు. నాయకులకు వాటిపై సరైన అవగాహన కూడా లేని పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపించింది. రేపెవరైనా ప్రత్యామ్నాయ సామాజికార్థిక విధానంతో రావడానికి కూడా దారులు లేని స్థితి కల్పిస్తున్నారనే బాధ సర్వత్రా వ్యక్తమౌతున్నది.
కనీసం ఎన్నికల వేళైనా పట్టుబట్టి ఏదైనా సాధించుకోవచ్చన్న ప్రజావిశ్వాసం క్రమంగా సన్నగిల్లుతున్నది. దాని స్థానే, ఎన్నికల వేళ కూడా ఏవో మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి, డబ్బు జల్లి పబ్బం గడిపేయొచ్చన్న రాజకీయుల విశ్వాసమే బలపడుతున్నది. అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో పాలకులకవైపు, స్వార్థం, అలసత్వంతో పౌరసమాజం మరోవైపు, సమకాలీన రాజకీయాలు భ్రష్టుపట్టడానికి అందరూ కారణమే అన్న విమర్శ బలపడుతున్నది. ఈ పరిస్థితి సమూలంగా మారాలనే డిమాండ్ అన్ని వైపుల నుంచీ వస్తున్నది. విప్లవకవి చెరబండరాజు అన్నట్టుగా ‘‘... చేదోడుగా వాదోడుగా సర్వశక్తియుక్తులతో మనమంతా నిలవనిచో చేతులెత్తి పిలవనిచో తప్పదు తప్పదు
చరిత్ర ద్రోహం’’
ఈసీ వైఫల్యం క్షమార్హమా?
బరితెగించిన కొత్త రాజకీయ పంథాకు, పట్టపగ్గాల్లేని అధికార(వి)క్రీడకు మునుగోడు అద్దం పట్టింది. ఏ ప్రమాణాలతో చూసినా, ఎన్నికల రాజకీయాల్లో ఇది మరింత దిగజారుడుతనానికి పరాకాష్ట! ఓటరును ప్రలోభ పెడుతూ డబ్బు, మద్యం, వినిమయ వస్తువుల పంపిణీ విచ్చలవిడిగా జరుగుతుంటే ఈసీ చోద్యం చూసింది. ఉల్లంఘనలను అడ్డుకోలేకపోయింది.
ప్రచార ఘట్టం నుంచి ఆ వైఫల్యం పోలింగ్ తేదీ వరకు నిరాఘాటంగా సాగింది. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎన్నికల ప్రక్రియ సాగేలా చూడటం ఎన్నికల సంఘం బాధ్యత అని, అందుకోసం సమకాలీన చట్టాల్లో నిర్దిష్ట ప్రస్తావనలు లేనప్పుడు కూడా, భారత రాజ్యాంగపు అధికరణం 324 నుంచి అధికారాలను పొంది ఈ పని చేయాలి తప్ప, చేతులు ముడుచుకొని కూర్చోవద్దని సుప్రీం కోర్టు(ఎమ్మెస్ గిల్ వర్సెస్ ఈసీ కేసులో) విస్పష్టంగా చెప్పింది.
స్వయంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, ఇలాంటి ప్రభావకాలు ఏవీ లేకుండా నియంత్రించాల్సిన ఎన్నికల సంఘం, మునుగోడులో చేష్టలుడిగి కూర్చుంది. నిర్దిష్టంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కమిషన్ కార్యాలయం ముందు కోదండరామ్ వంటి వారు దీక్షకు దిగినా స్పందన కరువయింది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా నియోజకవర్గం నిండిపోయి, కొందరు పోలింగ్ రోజు వరకూ అక్కడే ఉండిపోవడం బహిరంగ ఉల్లంఘనే!
వాటిని నియంత్రించలేని దురవస్థకు ఎన్నికల సంఘం బాధ్యత వహించదా? నిర్ధిష్టంగా ఫిర్యాదులున్నా, మీడియా కోడై కూసినా.. ఒక ఉప ఎన్నికనే సజావుగా నిర్వహించలేని ఈసీ ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిగే సాధారణ ఎన్నికలకు ఏం భరోసా ఇవ్వగలుగుతుంది? అన్న ప్రశ్న సహజం! రాజ్యాంగంతో పాటు పలు చట్టాలను సవరించుకొని, కొత్తవి ఏర్పరచుకొని వివిధ విడతల ఎన్నికల సంస్కరణలు తెచ్చుకున్న తర్వాత కూడా మన పరిస్థితి ఏ లాటిన్ అమెరికా దేశాలకంటేనో, ఆఫ్రికా దేశాలకన్నానో అధ్వానంగా ఉంటే మరేమిటి దారి? అన్నవి జనం మెదళ్లను తొలిచే ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ఈసీనే!
- దిలీప్ రెడ్డి,
dileepreddy.ic@gmail.com