బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్.. తాగుబోతుల తెలంగాణగా మార్చిండని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడులోని లక్కారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్.. కేసీఆర్ సీఎం అయ్యే నాటికి లిక్కర్ తో రాష్ట్ర ఆదాయం 10 వేల కోట్లు ఉంటే..ఈ 8 ఏళ్లలో 36 వేల కోట్లకు పెరిగిందన్నారు. పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా? అమరుల త్యాగాలు ఇలాంటి తెలంగాణ కోసమేనా? అని ప్రశ్నించారు. మునుగోడు ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చిండన్నారు.
మునుగోడులో ఎన్నో సమస్యలు ఉన్నాయని రేవంత్ అన్నారు. లక్కారం చెరువు నిండితే కాలువలు తీసే సోయి కూడా కేసీఆర్ కు లేదన్నారు. మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడే స్రవంతిని గెలిపించాలన్నారు. రాజగోపాల్ రెడ్డికి ధైర్యముంటే ఆడబిడ్డ సవాల్ ను స్వీకరించాలన్నారు. మందు పోయకుండా ఓటు అడుగుతామని దేవుడి మీద ప్రమాణం చేయాలని రేవంత్ అన్నారు. అంతకు ముందు మాట్లాడిన పాల్వాయి స్రవంతి మునుగోడు అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.