మునుగోడు, నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) రంగంలోకి దిగింది. టీజేఎస్ అభ్యర్థిగా పల్లె వినయ్ కుమార్ గౌడ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో సర్పంచుగా పోటీ చేసిన వినయ్ కుమార్ గౌడ్ ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించడంపై విమర్శలు గుప్పించిన టీజేఎస్ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించింది.
చండూర్ మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన వినయ్ కుమార్ గౌడ్ తమ పార్టీ ముఖ్య నాయకులతో కలసి చండూర్ లో ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ సహకారంతో తెలంగాణ ఉద్యమకారులతో కలసి ముమ్మర ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఇప్పటి వరకు 32 మంది అభ్యర్థులు 52 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.