నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికల ఫలితంపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మరోసారి స్పందించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంగబలం.. అర్థబలంతో ఖూనీ చేశాయని మీడియా సమావేశంలో మండిపడ్డారు. రెండు ప్రధాన పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలో 500 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం జరిగింది కాదు.. ఓట్లను డబ్బుతో కొనడం కోసమే జరిపినట్లుందని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో డబ్బు.. మంది మార్బలం.. మద్యం పంపిణీ చేసి.. ప్రలోభాలకు గురిచేస్తే.. బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు, ఎంపీల ద్వారా డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కోవర్టు రాజకీయాలే ప్రధానపాత్ర పోషించాయని..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్ట్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశాయని ఆరోపించారు. ఈ విషయం హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లిందని.. వెంకట్ రెడ్డిపై హై కమాండ్ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇంత అనైతిక రాజకీయాలను తానెప్పుడూ చూడలేదన్నారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ధనబలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని పాల్వాయి స్రవంతి ఆరోపించారు.