గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా కారును పోలిన గుర్తులపై పోరాటాన్ని కొనసాగిస్తమని మంత్రి తలసాని వెల్లడించారు. మునుగోడులో టీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నాంపల్లిలో టీఆర్ఎస్ కు మంచి స్పందన వస్తోందన్నారు. ఓ వ్యక్తికి మదం పట్టడం వల్లే మునుగోడు ఎన్నికలు వచ్చాయన్నారు. మూడున్నరెళ్ళలో రాజగోపాల్ రెడ్డి ప్రజల్లో లేరని స్థానికులే చెబుతున్నట్లు వెల్లడించారు. మునుగోడుకు రూ. 1000 కోట్లు తెస్తానంటున్న రాజగోపాల్ రెడ్డి, దుబ్బాక, హుజూరాబాద్ లలో గెలిచిన వాళ్ళు ఎందుకు తేలేదని ప్రశ్నించారు.
చేతకాక పారిపోయిన రాజగోపాల్ రెడ్డికి చరమ గీతం పాడాలని ప్రజలకు తలసాని సూచించారు. బీజేపి కార్పొరేటర్ వద్ద కోటి రూపాయలు దొరికాయంటే అర్థం చేసుకోవచ్చన్నారు. బీజేపీ నేతలు ఏక వచనంతో తిట్టడం, అరవడం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు, మునుగోడు లో ఫ్లోరోసిస్ లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఎంత అభివృద్ది జరిగినా అక్కడక్కడ సమస్యలు ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యవస్థ మీద అధికారం చెలాయిస్తోందని విమర్శించారు.