మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలోనే కాదు, యావత్ దేశంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆ మాటకొస్తే అత్యంత ఖరీదైన ఎన్నిక కూడా ఇదే. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వంద మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులను అక్కడ మోహరించి ప్రతి రెండు వేల జనాభాకు ఒక నాయకుడిని బాధ్యుడిని చేయడం, మున్సిపల్‌కార్పొరేషన్ చైర్మన్లను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను ప్రచారానికి ఉపయోగిస్తూ ప్రగతి భవన్ నిరంతర నిఘా పర్యవేక్షణలో మునుగోడును ఖరీదైన ఉప ఎన్నికగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంతవరకు ఈ స్థాయిలో ఒక ఉప ఎన్నికపై ఇంతపెద్ద ఎత్తున అధికారపార్టీ దృష్టిపెట్టిన సందర్భాలు గతంలోనూ ఉన్నా.. ఇప్పుడు మరింత పెరగడం గమనార్హం. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక ఉప ఎన్నికను ఎదుర్కోవడంలో సహజంగా అధికార పార్టీకి అనేక అనుకూల అంశాలు ఉంటాయి. కానీ అంతగా బలమైన క్యాడర్ లేని బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఒక చాలెంజ్‌గా రాజగోపాల్‌రెడ్డిని రంగంలోకి దించడం ముఖ్యంగా టీఆర్ఎస్ను ఒక అభద్రతా భావంలోకి నెట్టిందని చెప్పొచ్చు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అన్న చర్చను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకుపోయిన మాట వాస్తవం. దీనికి తోడు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 88 సీట్లు గెలిచినప్పటికీ ఆరు మాసాల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు సీట్లు గెల్చుకోవడం, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 48 మంది కార్పొరేటర్స్థానాల్లో పాగా వేయడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆలోచింపచేసింది.
పార్టీల అంతర్మథనం
ఈ ఉప ఎన్నిక దేని కోసం, ఎవరి ప్రయోజనాల కోసం అన్న చర్చను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పదే పదే ఎన్నికల ప్రచారంలో తెర మీదకు తెస్తున్నాయి. కానీ మునుగోడు ఉప ఎన్నిక మాత్రం రాకుంటే బాగుండు అన్న మానసిక ఆలోచనలో టీఆర్ఎస్, కాంగ్రెస్ఉన్నట్లు కనిపిస్తున్నది. మునుగోడు ఎన్నికలో ఏపార్టీకి మొదటి స్థానం, రెండో స్థానం లభిస్తుందన్న రాజకీయ చర్చ కూడా ప్రజల్లో ఉంది. మూడో స్థానం దక్కిన పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే చర్చ కూడా ఉంది. అందుకే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కేసీఆర్.. కనీసం ఏనాడూ తనను కలువడానికి అపాయింట్‌మెంట్‌కూడా ఇవ్వని సీపీఐ, సీపీఎంల మద్దతు కూడా కూడగట్టుకున్నారు. బీజేపీని జాతీయ స్థాయిలో నిలువరించడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఢిల్లీ వేదికగా కలిసి పనిచేస్తున్నప్పటికీ, మునుగోడులో మాత్రం తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడానికి కారణం, రాష్ట్రంలో కాంగ్రెస్‌కంటే బీజేపీ బలపడిందని తమ్మినేనివీరభద్రం లాంటి వారు బహిరంగంగా ప్రకటించడం గమనించాల్సిన విషయం. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయ భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చగలదని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే మునుగోడు ఫలితం సహజంగా మొత్తం రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం
రాజగోపాల్‌రెడ్డి తన కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరారని టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినప్పటికీ.. అతని రాజీనామాకు కారణం టీఆర్ఎస్ప్రభుత్వం మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని.. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రం వందల కోట్ల నిధులు కేటాయిస్తున్నారనే విషయం అసెంబ్లీ లోపలా, బయటా అనేక సార్లు రాజగోపాల్‌రెడ్డి నిలదీసిన సందర్భాలు ప్రజలకు తెలియని విషయం కాదు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాక ఒక కొత్త మండలాన్ని ఏర్పాటు చేయడం, నియోజకవర్గంలో రోడ్లు నిర్మాణాలు చేపట్టడం, వందల కోట్ల అభివృద్ధి పనుల్లో కదలిక రావడం, రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయడం, లారీ యజమానుల సమస్యలను పరిష్కారానికి హామీ ఇవ్వడం ఒక భాగమైతే, టీఆర్ఎస్నాయకులకు ప్రగతి భవన్గేట్లు ఓపెన్అయ్యాయని చెప్పొచ్చు. గతంలో కాంగ్రెస్, బీజేపీలోకి వలస వెళ్లిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌లాంటి వాళ్లను తిరిగి టీఆర్ఎస్లో చేర్చుకోవడం చూస్తే.. కేసీఆర్ఆంతరంగిక అభద్రతా భావాన్ని తెలియజేస్తున్నది. రాష్ట్రంలో గత మూడేండ్లుగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్న మాట నిజం. మునుగోడు ఉప ఎన్నికలోనూ గెలుపును నిర్ణయించబోయేది ప్రభుత్వ వ్యతిరేకతనే అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అది అందరి కన్నా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుపునకు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. మునుగోడు ఉప ఎన్నిక, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఒక రిహార్సల్లాంటిదే. అలాగే మునుగోడు ఫలితం తెలంగాణ భవిష్యత్ రాజకీయాలపైనా ముద్ర వేసే అవకాశం లేకపోలేదు.
గంగాపురం వెంకట్‌రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్