టీఆర్ఎస్, బీజేపీలకు ఈసీ కొమ్ముకాస్తోంది : రేవంత్

ఎన్నికల బ్యాలెట్ లో అన్యాయం జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీలకు బ్యాలెట్ లో ముందు స్థానం ఉండాలన్నారు. జాతీయ పార్టీల తర్వాత టీఆర్ఎస్ కు 4వ స్థానం కేటాయించాలి కానీ.. టీఆర్ఎస్ కు రెండో స్థానం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం  కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తర్వాత టీఆర్ఎస్ ఉండాలన్నారు.  ఎన్నికల కమిషన్ బ్యాలెట్ లో తప్పిదాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీలకు కొమ్ముకాస్తోందన్నారు. పార్టీలపై  ఈసీ  వివక్ష మంచిది కాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందన్నారు.

ఈసీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది

బీజేపీ వందలాది వాహనాలతో మునుగోడులో ప్రచారం చేస్తుందని రేవంత్ అన్నారు. మంత్రులు ప్రభుత్వ వాహనాలను తెచ్చి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు తమపై భౌతిక దాడులు చేస్తున్నారని...  కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేసినా.. ఇంత వరకు పోలీసులు ఏ ఒక్కరిపై కేసులు నమోదు చేయడం లేదన్నారు. వీటన్నిటిని  ఎలక్షన్ కమిషన్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు అధికారులు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల వాహనాలనే రెగ్యులర్ గా తనిఖీలు చేస్తున్నారని అన్నారు.

రఘునందన్..ఈటల సానుభూతితో గెలిచిన్రు..

దుబ్బాక ఎన్నిక సమయంలో రఘునందన్ కు సానుభూతి వచ్చేలా దాడులు చేసి గెలిపించారని  రేవంత్ ఆరోపించారు. అదే విధంగా హుజురాబాద్ లో ఈటలపై కూడా కేసులతో బెదిరించి ప్రజల్లో సానుభూతి తీసుకొచ్చి గెలిపించారన్నారు. ఈటల గెలిచిండు.. రఘునందన్ గెలిచిండు కానీ ఆ కేసులు ఎక్కడ పోయినవో  అర్థం కావడం లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు  పాము, ముంగీస ఆటలా  ఉన్నాయన్నారు.  తనకు తెలిసిన సమాచారం ప్రకారం మునుగోడులో సీఆర్ఫీఎఫ్ బలగాలు దిగబోతున్నాయన్నారు.  అమిత్ షా రంగంలోకి దిగి.. టీఆర్ఎస్ పై ఒత్తిడి చేసేలా ప్లాన్ చేస్తున్నారన్నారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ  మధ్యనే పోటీ ఉన్నట్లు చెప్పబోతున్నారన్నారు. పీకే డైరెక్షన్ మేరకే ఈ రెండు పార్టీలు  ఇలా వ్యవహరిస్తున్నాయన్నారు.  కేసీఆర్, మోడీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపుతారని.. ఎన్నికల కమిషన్ ముందు ధర్నా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. వెస్ట్ బెంగాల్ లో ఎలాంటి వాతావరణం కల్పించారో అలాంటి వాతావరణమే మునుగోడులో కల్పిస్తున్నారని అన్నారు. తన ప్రెస్ మీట్ నే  ఎన్నికల సంఘం ఫిర్యాదుగా  పరిశీలించాలన్నారు.

పార్టీ అధినేతలైనా మా సవాల్ స్వీకరించాలి  

దీపావళి రోజున మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికలకు పోదామని సవాల్ విసిరితే..  ఇప్పటివరకు ఒక్కరు కూడా ముందుకు రాలేదని రేవంత్ అన్నారు.  అభ్యర్థులు రాకుంటే పార్టీ అధినేతలైనా తమ సవాల్ స్వీకరించాలన్నారు.  బిడ్డలను మందుకు బానిసలను చేయొద్దని తల్లులు వేడుకుంటున్నారని..12 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లలను మత్తుకు బానిసలుగా చేస్తే..ఎన్నికల తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటని రేవంత్ ప్రశ్నించారు.