- ఉప ఎన్నికతో ఉపాధి ఫుల్
- మునుగోడు ఎలక్షన్ బిజినెస్ రూ.500 కోట్లకు పైనే
మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: ఉప ఎన్నికల పుణ్యమాని మునుగోడు నియోజకవర్గంలో చిన్నచితక బిజినెస్ లు కళకళలాడుతున్నాయి. ఎలక్షన్ పనుల వల్ల వేలాది మందికి చేతినిండా పని దొరుకుతోంది. వంటవాళ్లు, జెండాలు మోసేటోళ్లు, డప్పు, కోలాటం కళాకారులు, డీజే, ట్రావెల్స్ నిర్వాహకులకు ఉపాధి లభిస్తోంది. ఎన్నికలు జరిగే 7 మండలాల్లో చికెన్, మటన్, కిరాణా, బట్టలషాపులు, హోటళ్లు, టీ స్టాళ్లు, బిర్యానీ సెంటర్లు, వాటర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్ ల్లాంటి అనేక వ్యాపారాలకు ఫుల్ గిరాకీ ఉంది. ఏడాది సంపాదన నెలరోజుల్లో వచ్చిందంటే బిజినెస్ ఏ రేంజ్లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా దాదాపు రూ.500 కోట్ల బిజినెస్ జరిగిందని అంచనా.
రోజుకు రెండు టన్నుల చికెన్..
ప్రధాన పార్టీలతోపాటు చిన్నాచితక పార్టీలు, ఇండింపెండెంట్లు కూడా ప్రచారంలో తిరిగే కార్యకర్తలతోపాటు మీటింగ్ లకు వచ్చిన జనానికి చికెన్‌తో భోజనం పెడుతున్నారు. క్యాంప్ ఆఫీసులు నిత్యాన్న దాన సత్రాలుగా మారిపోయాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెడుతున్నారు.ఎక్కడ భోజనాలు పెట్టినా మెనూలో కచ్చితంగా చికెన్ ఉంటోంది. దీంతో సాధారణ రోజుల్లో 30 నుంచి 50 కిలోలు అమ్మే ఒక్కో చికెన్ సెంటర్ ఓనర్‌కు రోజుకు క్వింటాన్నర నుంచి 2 క్వింటాళ్ల ఆర్డర్ వస్తుండడం విశేషం. వారంలో ఒకటి, రెండుసార్లు మటన్‌తో భోజనం పెడుతున్నారు. మటన్ సాధారణ రోజుల్లో రోజుకు 30 క్వింటాళ్ల దాకా, సండే 50 క్వింటాళ్ల వరకు ఆర్డర్లు వస్తున్నాయి.
ఇళ్లు, రూమ్ లు, లాడ్జీలకు కిరాయిలెక్కువే..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతోపాటు సర్వే బృందాలు, మీడియా ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది 20 రోజులుగా మునుగోడులోనే అడ్డా వేసిన విషయం తెలిసిందే. వీళ్లంతా కలిపి 30 వేల మంది వరకు ఉంటారని అంచనా. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇళ్లు, రూమ్‌లు, లాడ్జీలు ఫుల్ అయ్యాయి. ఇదే అదనుగా ఓనర్లు రేట్లు కూడా పెంచేశారు. చౌటుప్పల్, చండూరు లాంటి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పార్టీల కీలక నేతలు నెల రోజులకు ఒక్కో పెద్ద ఇంటికి రూ.50 వేల వరకు కిరాయి చెల్లిస్తున్నారు. రెండంతస్తుల ఇళ్లకైతే లక్ష వరకు చెల్లిస్తున్నారు. గ్రామాల్లోనూ కొందరు తమ సొంత ఇళ్లను కిరాయికి ఇచ్చి పక్కన రేకుల షెడ్లలో అడ్జస్ట్ అవుతున్నారు. చిన్న చిన్న రూమ్ లు కూడా రూ.10 వేలకు తక్కువ లేవు. వివిధ క్యాస్ట్, ప్రొఫెషనల్స్ సంఘాల సమ్మేళనాల కోసం ఫంక్షన్ హాళ్లను నెల రోజులకుగాను రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలు చెల్లించారు. మొత్తంగా ఇళ్లు, రూమ్ లు, ఫంక్షన్ హాళ్లు, లాడ్జీల బిజినెసే సుమారు రూ.50 కోట్ల మేర నడిచి ఉంటుందని అంచనా.
కూలీలకు గిరాకీ
ర్యాలీలు, మీటింగ్‌ల కోసం అన్ని పార్టీల నుంచి డిమాండ్ ఉండడంతో కూలీలు రోజువారీ పనులకు వెళ్లడం లేదు. మీటింగ్‌లకు ఒక్కో పార్టీ రూ.300 నుంచి రూ.500 ఆఫర్ చేస్తోంది. బతుకమ్మ, బోనం ఎత్తితే అదనంగా100 ఇస్తున్నారు. అన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలకు చెందిన టీమ్ లకు, మండల కేంద్రాల్లోని పార్టీ ఆఫీసుల్లో వందలాది మందికి భోజనాలు వండేందుకు కుక్ లకు డిమాండ్ పెరిగింది. ప్రచారం ముగిసేనాటికి వండి పెట్టేందుకు వంట మాస్టర్లు తమ టీమ్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్షవరకు చార్జీ చేస్తున్నారు. 10 మందితో కూడిన డప్పు కళాకారులు, కోలాటం ఆడే మహిళల టీమ్ లకు ఒక్కో మీటింగ్ కు రూ.20 వేల నుంచి రూ.40 వేలు చెల్లిస్తున్నారు.
హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు మస్త్ వ్యాపారం..
ఆయా పార్టీ క్యాంప్ ఆఫీసులు, కార్యకర్తలు ఉండే చోట రోజూ వంటలు చేస్తున్నప్పటికీ... ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సర్వే బృందాలు, ప్రజా సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధులు భోజనానికి హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో మండల కేంద్రాల్లోని ఉదయం టిఫిన్ల దగ్గరి నుంచి లంచ్, డిన్నర్ సమయాల్లో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 20 నుంచి 30 మంది లంచ్ రెడీ చేసే ఒక్కో హోటల్ లో ఇప్పుడు ఏకంగా 200 నుంచి 300 మంది భోజనం చేస్తున్నారు. భారీ సభలు జరిగిన రోజుల్లో ఆ సంఖ్య వేలల్లోకి చేరుకుంటోంది. బై ఎలక్షన్ గిరాకీని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గవ్యాప్తంగా కొత్తగా బిర్యానీ సెంటర్లు, హోటళ్లు పదుల సంఖ్యలో వెలిశాయి. ఇక మండల కేంద్రాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు, వచ్చిపోయేవాళ్లతో టీ స్టాళ్లు కళకళాలాడుతున్నాయి. గతంతో పోలిస్తే టీ బిజినెస్ నాలుగింతలైందని మునుగోడు మండల కేంద్రంలోని మిస్టర్ టీ నిర్వాహకుడు ప్రమోద్ రెడ్డి వెల్లడించారు.
రూ.20 వేలు ఇస్తున్నరు
బీజేపీ పార్టీ వాళ్లకు మునుగోడు మండలం జమస్థాన్ పల్లిలో వంట చేస్తున్నా. నెల రోజులకుగాను నాకు రూ.20 వేలు ఇస్తున్నరు. నా చేతి కింద పని చేసేవాళ్లకు రోజు కూలీ కట్టిస్తున్నరు.
-
దోమలపెల్లి శ్రీనివాసులు, వంట మాస్టర్, మునుగోడు
రోజుకు 2 క్వింటాళ్లు అమ్ముతున్న..
గతంలో కంటే ఇప్పుడు చికెన్ ఎక్కువగా అమ్ముడు పోతోంది. గతంలో రోజు 30 నుంచి 40 కిలోల చికెన్ అమ్మేవాళ్ళం. ఇప్పుడు 150 నుంచి 200 కేజీల చికెన్ అమ్ముతున్నాం. వ్యాపారం బాగుంది.
- నల్లగాసు శంకర్ యాదవ్, చికెన్ సెంటర్, మునుగోడు