కాషాయమయమైన మునుగోడు

  • బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనం
  • కాషాయమయమైన మునుగోడు 
  • సభ సక్సెస్​తో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం

మునుగోడు, వెలుగు: మునుగోడు సభ సక్సెస్​తో బీజేపీలో నయా జోష్ ​కనిపించింది. ఆదివారం నిర్వహించిన బహిరంగసభకు కేంద్ర హోంమంత్రి అమిత్​షా హాజరుకావడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు బైపోల్​ను బీజేపీతో సహా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్​సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి. దీంతో ఈ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభకు మునుగోడు నియోజకవర్గంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, జనాలు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో మీటింగ్ కు హాజరయ్యారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ ప్రసంగాలతో పబ్లిక్​ను ఉత్తేజపరిచారు. కార్లు, ఇతర వాహనాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా సభకు తరలివచ్చారు. లీడర్ల ఫ్లెక్సీలతో మునుగోడు కాషాయమయమైంది.

బీజేపీలో చేరిన లీడర్లు, కార్యకర్తలు 

మీటింగ్​లో రాజగోపాల్ రెడ్డితోపాటు, నియోజకవర్గంలో పలువురు నాయకులు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన లీడర్లు అమిత్​షా సమక్షంలో పార్టీలో చేరారు. రాజగోపాల్​రెడ్డి ముఖ్య అనుచరుడు మునుగోడు పీఏసీఎస్​ చైర్మన్​, డీసీసీబీ డైరక్టర్ ​కుంభం శ్రీనివాస్​రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్ అమిత్​షా సమక్షంలో కాషాయకండువా కప్పుకున్నారు.