ఎన్నికల ప్రచార హోరుతో మునుగోడు మార్మోగుతోంది. వివిధ పార్టీల నాయకుల తాకిడితో నియోజకవర్గం రాజకీయ సందడిని సంతరించుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన చౌటుప్పల్ మండలంలో ఇవాళ ప్రచారం చేశారు. తూప్రాన్ పేట నుంచి దుబ్బ తండా వరకు పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. చౌటుప్పల్ మండలం గుండ్లబావి, ధర్మోజీగూడెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు. రేపు మునుగోడు మండలంలో బీజేపీ లీడర్లు ప్రచారం చేయనున్నారు. లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీకి ఓటేయాలంటూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. గట్టుప్పల్ మండలంలో ఆమె ప్రచారం చేశారు.
కాంగ్రెస్ ..
కాంగ్రెస్ కూడా ఇంటింటి ప్రచారం చేస్తోంది. ఆపార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున రెండ్రోజులుగా నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు . రాజగోపాల్ రెడ్డికి అసలు ఓటు అడిగే హక్కు లేదని రేవంత్ అంటున్నారు. స్రవంతికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇవాళ నాంపల్లి మండలంలో రేవంత్ ప్రచారం చేశారు.
టీఆర్ఎస్..
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. బంగారిగడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న మంత్రులు.. అటు ప్రచారంతో పాటు ఇటు జనసమీకరణపై ఫోకస్ చేశారు. పార్టీ కార్యకర్తలతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ర్యాలీలో పాల్గొనేలా గులాబీ లీడర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లు అడిగారు.
బీఎస్పీ..
మునుగోడు బీఎస్పీ అభ్యర్థిగా అందోజు శంకరాచారి నామినేషన్ దాఖలు చేశారు. చండూరు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. నామినేషన్ పత్రాన్ని అందోజు శంకరా చారి.. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అటు మునుగోడులో ప్రచారాన్ని బీఎస్పీ ముమ్మురం చేసింది. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తో పాటు పార్టీ నేతలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
నామినేషన్లు..
మునుగోడు బై పోల్ కు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ జనసమితి తరఫున పల్లె వినయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అనుచరులతో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ ను కలిసి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈనెల 14న నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 15న నామినేషన్లు పరిశీలించనున్నారు. నవంబర్ 3న పోలింగ్..6న కౌంటింగ్ చేయనున్నారు. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనుండటంతో రేపు, ఎల్లుండి భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది.