బీఆర్ఎస్​ చచ్చిపోయిన పార్టీ: ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి

జనగామ, వెలుగు: బీఆర్ఎస్​ చచ్చిపోయిన పార్టీ అని, కేసీఆర్​ చచ్చిన పాముతో సమానమని కాంగ్రెస్​ భువనగిరి ఎంపీ ఎన్నికల ఇన్​చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి అన్నారు. డీసీసీ ప్రెసిడెంట్​కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​ రెడ్డిని గెలిపించాలని నర్మెటలో రోడ్​ షో నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్​ జనం గుండెల్లో ఉందని, బీఆర్ఎస్​ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. జనగామలో అధికార దుర్వినియోగంతో పల్లా రాజేశ్వర్​రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, నైతిక విజయం మాత్రం కొమ్మూరి ప్రతాప్​ రెడ్డిదేనన్నారు. భువనగిరి ఎంపీగా తనను, తన అన్న వెంకట్​ రెడ్డిని గెలిపించారని, ఇప్పుడు తమ్ముడు చామల కిరణ్​కుమార్​రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, కొమ్మూరి ప్రశాంత్​ రెడ్డి, రాకేశ్​రెడ్డి 
పాల్గొన్నారు.