నల్లగొండ: చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి అన్నారు. తప్పుడు ప్రచారంతో గ్రామాల్లో చేనేత కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి చేనేత కార్మికుల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేనేత సంఘాలను ఎన్నికలు పెట్టలేని దుస్థితి అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చేనేత ఎన్నికలు పెట్టి సంఘాల ద్వారా తయారు చేసిన వస్త్రాలను కోనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదు కునే ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేనేత కార్మికులకు అండగా ఉంటుందన్నారు. చేనేత కార్మికులను తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఇప్పటికే హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
2008 లోనే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రోశయ్యతో మాట్లాడి చేనేత కార్మికులకు రుణమాఫీ చేయించామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో ప్రతి చేనేత కుటుంబాలకు అండగా ఉంటూ ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ చేనేత కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా లేదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.