- పదేండ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు
రామన్నపేట/మోత్కూరు/ఆలేరు, వెలుగు: రాష్ట్రానికి తాను హోం మినిస్టర్ అయితే బీఆర్ఎస్ నేతలందరూ జైల్లో ఉంటారని భువనగిరి పార్లమెంట్ఇన్చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అందుకే తనకు హోం మంత్రి పదవి రావద్దని వాళ్లంతా పూజలు చేస్తున్నారని తెలిపారు. ‘అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు.
అలాంటి వాళ్లను జైల్లో పెట్టాలా వద్దా? అక్రమంగా ప్రజా సొమ్మును తిన్న నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా? వద్దా? ’ అని ప్రజలను ప్రశ్నించారు. గురువారం ఆయన నకిరేకల్, తుంగుతర్తి, ఆలేరు సెగ్మంట్లలో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫున రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు హోం మంత్రి ఇస్తే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడ్డ అందరినీ జైలుకు పంపిస్తానన్నారు. కిరాయి ఇంట్లో ఉన్న జగదీశ్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు.
కాంగ్రెస్‌ను గద్దె దించుతామనే వాళ్ల పార్టీని నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చాడని, కేసీఆర్ చేసిన పాపాలకే కవిత జైలుకు పోయిందని, ఆమె వచ్చే బతుకమ్మ అక్కడే ఆడుతుందని ఎద్దేవా చేశారు. భువనగిరి ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే తననే గెలిపించినట్లని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిస్తే మూసీ ప్రక్షాళన, ధర్మారెడ్డి, పిలాయి పల్లి, బునాది గాని కాలువ, బస్వాపూర్ ఆసిఫ్ నగర్ కాలువల పెండింగ్ పనులు పూర్తిచేసి రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.