ప్రజలు సన్న బియ్యంతో కడుపునిండా తింటున్నారు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  

ప్రజలు సన్న బియ్యంతో కడుపునిండా తింటున్నారు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  

చౌటుప్పల్, వెలుగు : సన్న బియ్యం పథకంతో పేదలు రెండు పూటలా కడుపునిండా అన్నం తింటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్ భార్య నవనీత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అపోలో ఆస్పత్రిలో చేర్పించి తన సొంత ఖర్చులతో వైద్యం చేయించారు. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఆమె ఇంటికి వచ్చారు.

ఆదివారం ఎమ్మెల్యే, ఆయన సతీమణి లక్ష్మి పంతంగి గ్రామానికి వెళ్లి దేవేందర్, నవనీతను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం లబ్ధిదారుడు అయిన బోయ దేవేందర్ ఇంట్లో ఎమ్మెల్యే దంపతులు కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని తెలిపారు. ఆయన వెంట నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్,  మాజీ జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు నరసింహగౌడ్, కాంగ్రెస్ నాయకులు బోయ రామచంద్రం, కడగంచి జనార్దన్, కడగంచి వెంకటేశం, చీరిక అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.