మునుగోడులో అన్ని పార్టీల వెంట పెద్దసంఖ్యలో జనం

  • అన్ని పార్టీల ఎన్నికల ప్రచారానికి, సభలకు వెల్లువలా పబ్లిక్

నల్గొండ, వెలుగు: ప్రధాన పార్టీలకు మునుగోడు ఓటరు అంతుచిక్కడం లేదు. ఏ పార్టీ ప్రచారానికి పిలిచినా పెద్దసంఖ్యలో వెళ్తున్నారు. అన్ని పార్టీల బహిరంగ సభలకూ తరలివస్తున్నారు. ఎవరు వచ్చి అడిగినా ‘మా ఓటు మీకే’ అంటున్నారు. ఎవరు పైసలిచ్చినా తీసుకుంటున్నారు. మందు, విందుకు పిలిస్తే వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఊహించని స్థాయిలో వచ్చిన పబ్లిక్​ను చూసి  అన్ని పార్టీల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికి జనమంతా తమ వెంట ఉన్నట్లు కనిపిస్తున్నా చివరికి ఏం చేస్తారోననే టెన్షన్​ పట్టుకున్నది.

సర్వేల్లోనూ ఇదే తీరు.. 

మునుగోడు నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో తమ పార్టీకి చెందిన ఓటర్లు ఎంతమంది ఉన్నారో కనిపెట్టేందుకు మూడు ప్రధాన పార్టీలు ఇటీవల సర్వేలు చేయించాయి. ఏ పార్టీ వాళ్లు వచ్చి అడిగినా ‘మీకే ఓటు వేస్తాం’ అని చెప్పడం వల్లే సర్వే రిపోర్టులన్నీ ఆయా పార్టీలకు అనుకూలంగా వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రచారం టైంలో లీడర్లకూ ఇదే అనుభవం ఎదురవుతోంది. టీఆర్ఎస్​ నేతలు వచ్చి, ‘మీకు పింఛన్ ​వస్తుంది కదా?.. రైతుబంధు తీసుకుంటున్నారు కదా? మీ ఓటు మాకే వేయాలి..’ అంటే ‘అవును.. అలాగే’ అంటున్నారు. అదే  బీజేపీ నేతలు వచ్చి, ‘రాజగోపాల్​రెడ్డి ప్రతిపక్షంలో ఉండడం వల్లే ఈ నియోజకవర్గంపై ప్రభుత్వం ఇన్ని రోజులు వివక్ష చూపింది. ఎలాంటి ఫండ్స్​ ఇవ్వకపోవడం వల్లే అభివృద్ధి జరగలేదు.. అందువల్లే రాజీనామా చేయాల్సి వచ్చింది..’ అని చెప్తే ‘అదీ కరెక్టే’ అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్​కు చెందిన పాల్వాయి స్రవంతి వచ్చి, ఆడబిడ్డగా ఆశీర్వదించాలంటూ గాజులు ఇస్తే తీసుకుంటున్నారు. అందరికీ  ‘మా ఓటు మీకే’ అని చెప్తున్నారు. ఇక గ్రామాల్లో ఇంటింటి ప్రచారానికి వచ్చే జనానికి లీడర్లు రోజుకు రూ.300 నుంచి రూ.400 దాకా చెల్లిస్తున్నారు. సభలకు, నామినేషన్​లాంటి కార్యక్రమాలకైతే రూ.500 నుంచి రూ.వెయ్యి దాకా ఇస్తున్నారు. కొందరైతే ఏ పార్టీ కార్యక్రమానికి వెళ్తే ఆ పార్టీ కండువాలు మెడలో వేసుకుంటున్నారు. ఒకరోజు బీజేపీలో కనిపించిన వ్యక్తులే తెల్లారి టీఆర్ఎస్​, కాంగ్రెస్​లో కనిపిస్తున్నారు. ఈ మూడు పార్టీలు నిర్వహించిన సభలకు వేలాదిగా తరలివస్తున్నారు. ఇటీవల గ్రామాల్లో  లీడర్లు తిష్టవేస్తుండడంతో మందు, విందు కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఏ పార్టీ లీడర్​ దావత్​ ఇచ్చినా మహిళలు తప్ప ఊళ్లోని మగవాళ్లంతా కట్టగట్టుకొని పోతున్నారు. ‘పొద్దున మా పార్టీ ప్రచారంలో 200 మంది ఉన్నారు.. సాయంత్రం వాళ్లకు దావత్​ ఇద్దామని పిలిస్తే ఏంతక్కువ 500 మంది వచ్చారు.. అందులో అన్ని పార్టీల వాళ్లున్నారు.. ఎలక్షన్​ కావడంతో ఎవరినీ కాదనలేని పరిస్థితి’ అని చండూరులో అధికారపార్టీకి చెందిన ఓ లీడర్​ వాపోయాడు. ఇలా మీటింగులకు, దావత్​లకు వచ్చిన జనాల్ని చూసి కొందరు పెద్ద లీడర్లు జబ్బలు చరుకుంటున్నారని, కానీ పోలింగ్​ బూత్​లో ఓటు పడేదాకా అనుమానమేనని ఆ లీడర్​ చెప్పారు.

కులసంఘాల్లోనూ అటు.. ఇటు..

గ్రామాల్లో  ప్రధాన పార్టీల లీడర్లు కులసంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కులపెద్దలను మచ్చిక చేసుకొని కులస్థులందరినీ పోగేస్తున్నారు. రాని వారికి ఫైన్లు కూడా వేస్తున్నారు. వచ్చిన వారి సంఖ్యను చూపి నేతలు బేరసారాలు మాట్లాడుతున్నారు. గతంలో కులాలన్నీ ఒకే మాటకు కట్టుబడి ఉండేవి. కానీ ఇప్పుడు కులసంఘాల్లో అన్ని పార్టీలవాళ్లు ఉంటున్నారు. కుల పెద్దల్లోనూ వేర్వేరు పార్టీలకు చెందినవాళ్లు ఉండడంతో అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి. లీడర్లే వచ్చి డబ్బులిస్తే ఎందుకు కాదనాలని, అందరూ వచ్చి తీసుకోవాలని, ఓటు మాత్రం ఇష్టం ఉన్నవాళ్లకు వేసుకోవచ్చని చాలా కులసంఘాల్లో పెద్దలు చెప్తున్నట్లు ఓ పార్టీ లీడర్​ వాపోయాడు. దీంతో ఎన్నికల్లో పోల్​ మేనేజ్​మెంట్​ ఎలా చేయాలో అర్ధంకావడం లేదని ఆయన తలపట్టుకున్నాడు.