రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మునుగోడు సీటు గులాబీ వశమైంది. గత నెలరోజులకు పైగా సాగిన ప్రచార జోరుకు ఓటరు తీర్పు ఇచ్చారు. ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఓవరాల్ ఆధిక్యంతో ఎక్కడా వెనకబడకుండా నిలిచి గెలిచారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రతి రౌండ్ లో గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి డిపాజిట్ గల్లంతైంది.
మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శించారు కూసుకుంట్ల. 2, 3, 15 రౌండ్లలో మాత్రమే బీజేపీకి స్వల్ప ఆధిక్యత లభించింది. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ 228 ఓట్లు రాగా, బీజేపీకి 224 ఓట్లు వచ్చాయి. అటు కాంగ్రెస్ కు 136 పోస్టల్ ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత ఈవీఎం లెక్కింపు మొదలైంది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి 6418 ఓట్లు వస్తే, బీజేపీకి 5126 వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 2100 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ లో 1292 ఓట్ల లీడ్ సాధించింది గులాబీ పార్టీ. ఇక రెండో రౌండ్ లో 7781 ఓట్లు కూసుకుంట్లకు రాగా, 8622 ఓట్లు రాజగోపాల్ రెడ్డికి వచ్చాయి. పాల్వాయి స్రవంతికి 1537 ఓట్లు వచ్చాయి. ఈ రెండో రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 841 ఓట్ల లీడ్ సాధించగలిగారు.
మూడో రౌండ్ లో 7390 ఓట్లు TRSకు రాగా, 7426 ఓట్లు బీజేపీకి పడ్డాయి. కాంగ్రెస్ కు 1926 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ లో 36 ఓట్ల స్వల్ప ఆధిక్యాన్ని కమలం పార్టీ సాధించింది. రెండు, మూడు రౌండ్లలోనే బీజేపీ లీడ్ లోకి వచ్చింది. మిగతా అన్ని రౌండ్లలోనూ గులాబీ పార్టీ దూసుకెళ్లింది. ఇక నాలుగో రౌండ్ లో 4,854 ఓట్లు గులాబీ పార్టీకి వస్తే, 4,555 ఓట్లు కమలం గుర్తుకు వచ్చాయి. ఫోర్త్ రౌండ్ లో 299 ఆధిక్యాన్ని టీఆర్ఎస్ సాధించింది.
ఇక ఐదో రౌండ్ లో 6062 ఓట్లు టీఆర్ఎస్ పడగా, 5,245 ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఫిఫ్త్ రౌండ్ లో 817 ఓట్ల లీడ్ ను గులాబీ పార్టీ సాధించింది. ఇక ఆరో రౌండ్ లో గులాబీ గుర్తుకు 6016 ఓట్లు వస్తే కమలం గుర్తుకు 5,378 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో 638 లీడ్ ను కూసుకుంట్ల సాధించారు. ఏడో రౌండ్ లో 7,202 ఓట్లు టీఆర్ఎస్ కు, 6,803 ఓట్లు బీజేపీకి వచ్చాయి. సెవెన్త్ రౌండ్ లో 399 స్వల్ప ఆధిక్యాన్ని టీఆర్ఎస్ పార్టీ సాధించింది.
ఇక ఎనిమిదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 6620 ఓట్లు రాగా, బీజేపీకి 6088 ఓట్లు పడ్డాయి. గులాబీ పార్టీకి 532 లీడ్ వచ్చింది. తొమ్మిదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 7517 వస్తే, బీజేపీకి 6665 ఓట్లు రాజగోపాల్ రెడ్డికి వచ్చాయి. నైన్త్ రౌండ్ లో 852 ఓట్ల లీడ్ కారు గుర్తుకు వచ్చాయి. అటు పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 7503 ఓట్లు వస్తే, బీజేపీకి 7015 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 1347 ఓట్లు వచ్చాయి. ఓవరాల్ గా టీఆర్ఎస్ కు టెన్త్ రౌండ్ లో 488 ఓట్ల లీడ్ మాత్రమే వచ్చింది.
11వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7214 ఓట్లు వస్తే, బీజేపీకి 5853 వచ్చాయి. 1361 ఓట్ల లీడ్ ను టీఆర్ఎస్ సాధించగలిగింది. 12వ రౌండ్ లో గులాబీ పార్టీకి 7448 ఓట్లు వస్తే బీజేపీకి 5448 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో 2 వేల ఓట్లు టీఆర్ఎస్ లీడ్ సాధించింది. 13వ రౌండ్ లో కూసుకుంట్లకు 6691 ఓట్లు వస్తే, బీజేపీకి 5346 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి 1345 ఓట్ల లీడ్ సాధించారు. 14వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 6612 ఓట్లు వచ్చాయి. బీజేపీ 5557 ఓట్లు సాధించింది. ఈ రౌండ్ లో 1055 ఓట్ల లీడ్ టీఆర్ఎస్ సాధించింది. 14వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేల ఓట్ల లీడ్ మార్క్ దాటారు.
ఇక ఫైనల్ రౌండ్ లో బీజేపీ స్వల్ప ఆధిక్యం చూపింది. టీఆర్ఎస్ కు 1270 ఓట్లు రాగా, బీజేపీకి 1358 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో 88 ఓట్ల లీడ్ సాధించింది బీజేపీ. ఓవరాల్ గా 10 వేల 341 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 ఉప ఎన్నికలను టీఆర్ఎస్ గెలిచినట్లయింది.ఉమ్మడి నల్గొండ జిల్లా అంతటా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.