చండూరు సీపీఎం,సీపీఐ సభలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భూ నిర్వాసితుడు నిలదీశాడు. కూసుకుంట్ల ప్రసంగం ముగియగానే రాంరెడ్డి పల్లికి చెందిన జంగయ్య చర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కాలించాలని నిలదీశాడు. 25ఏండ్లుగా కమ్యూనిస్టు పార్టీలో ఉంటున్నామని.. తమ సమస్యను పరిష్కరిస్తేనే టీఆర్ఎస్కే ఓటు వేస్తామన్నాడు.
కేసీఆరే కమ్యూనిస్టుల వైపు మారాడు
కమ్యూనిస్టులు కేసీఆర్ వైపు మారలేదు.. కేసీఆరే కమ్యూనిస్టుల వైపు మారాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మొదటి నుంచి బీజేపీపై పోరాడుతున్నామన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం చండూరులో సీపీఐ, సీపీఎం బహిరంగ సభ నిర్వహించాయి. కరోనా లాంటి బీజేపీని అడ్డుకోవడానికే కేసీఆర్తో కలిశామని నేతలు వ్యాఖ్యానించారు. ఏ పార్టీతో పొత్తు ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు.