మునుగోడు, నల్గొండ జిల్లా: చండూర్ మంమండల కేంద్రంలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేస్తుండడంతో నియోజకవర్గం నుండే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎక్కువ వాహనాలకు అనుమతి లేకపోవడంతో ముఖ్య నేతలతో కలసి రాజగోపాల్ రెడ్డి టాపు లేని వాహనంలో ప్రజలు, కార్యకర్తలు అభివాదం చేస్తూ నామినేషన్ కేంద్రానికి బయలుదేరారు. ఈ సందర్భంగా బీజేపీ ముఖ్య నేతలు రాజగోపాల్ రెడ్డికి విషెస్ చెప్పారు. తన నివాసం నుండి చుండూర్ నామినేషన్ వేయడానికి స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి ఒకే కారులో బయల్దేరి వెళ్లారు. చండూరులో ఓపెన్ టాపు వాహనంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు అందరికీ అభివాదం చేస్తూ నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు.
అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితోపాటు రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర అభ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. సెక్యూరిటీ కారణాలతో పలువురు ముఖ్య నేతలు ర్యాలీలో కొద్దిసేపు మాత్రమే పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ నిన్నటి నుంచే మునుగోడులో మకాం వేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.