యాదాద్రి భువనగిరి జిల్లా: ఉప ఎన్నిక పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీ ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలు, క్యాడర్ అంతా రోడ్ షోలు, సభలు, సమావేశాలతో బిజీ బిజీగా మారారు. మునుగోడు ఉపఎన్నిక రాజకీయ పార్టీల నేతలకు సవాల్ గా మారడంతో నాయకులతోపాటు క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలే వచ్చే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తూ ఆధిక్యం చాటుకునేందుకు తహతహలాడుతున్న నేతలు ఉప ఎన్నికలో విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పతాక స్థాయికి చేరిన ఉప ఎన్నిక వేడి
పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ఉప ఎన్నిక వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడులోని సమస్యల్ని పక్కక్కి పెట్టి...కేవలం గెలుపు కోసమే అక్కడి ప్రజల్ని ప్రలోభాలకు గురిచేస్తున్నరనే చర్చ జరుగుతోంది. అటు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండటంతో ...బైపోల్ హీట్ పీక్ స్టేజ్ కి చేరుకుంది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశం
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా నాటి నుంచి ఇప్పటి వరకు నేతలంతా మునుగోడు గురించే మాట్లాడుకుంటూ.. చర్చించుకుంటున్నారు. ఎన్నిక పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఒకరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లకు ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. దీంతో ఉప ఎన్నిక మరింత హీటెక్కింది. గతంలో ఎన్నడూ లేనంతా ఉపఎన్నిక గెలుపును పార్టీలు సవాల్ గా తీసుకుని హోరా హోరీగా తలపడుతుండడం హాట్ టాపిక్ అయింది.
మునుగోడు నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా చాలా గ్రామాల్లో సరైన రోడ్లు లేవు. రోడ్లు అధ్వాన్నంగా ఉంటడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో 2014 కంటే ముందు నుంచి ఎవరూ పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కేవలం ఉప ఎన్నికలు రావడంతోనే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మునుగోడులోనే మకాం వేసి.. హడావుడిగా రోడ్లు వేయిస్తున్నారు. ఏళ్ల తరబడి గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతుంటే ఎవరూ.. ఏ రోజూ పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు కేవలం మంత్రుల వాహనాలు తిరగడం కోసమే రోడ్లు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వెంటాడుతున్న ఫ్లోరైడ్ సమస్య
మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికీ ఫోరైడ్ సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ ప్రాంతంలో వివిధ కంపెనీలు ఉన్నాయి. కాలుష్యం వల్ల చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇక్కడే వందల కంపెనీలున్నా.. ఉద్యోగాలు స్థానికలుకు కాకుండా ఇతరులకు ఇస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. చాలా మంది అర్హులకు పెన్షన్ రావడం లేదు. అయితే టీఆర్ఎస్ కి చెందిన వారిని ఒకలాగా.. ఇతర పార్టీల వారిని మరోలాగా లోకల్ లీడర్లు ట్రీట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీఆర్ఎస్ కు చెందిన వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. ఇతరులకు స్కీంలు అందడం లేదని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.
మునుగోడులో చాలా సమస్యలున్నా... అవేమి పట్టించుకోకుండా కేవలం తామ పార్టీ గెలిస్తే చాలంటూ నేతలు వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంత డబ్బు ఖర్చు చేసైనా పక్కాగా గెలవాలనే తీరుతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మందు, విందులతో మునుగోడు గుప్పుమంటోంది. ఉదయం నుంచే యువతను మద్యం మత్తులో దించుతున్నట్లు తెలుస్తోంది. ఇక రైతుబంధు, రుణమాఫీ విషయంలో రైతుల్లో అసంతృప్తి ఉన్నా...దానిపై టీఆర్ఎస్ లీడర్లు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా సమస్యలపై నేతలు ఫోకస్ చేయాలని మునుగోడు ప్రజలు కోరుతున్నారు.