నల్గొండ అర్భన్, వెలుగు : మునుగోడులో గెలిచి రానున్న రోజుల్లో సీఎం అవుతానని, మునుగోడు ఉప ఎన్నికలో 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ఇండిపెండెంట్అభ్యర్థి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొండలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోని 155 దేశాలు తిరిగానని, మునుగోడు ప్రజలు చూపించిన ప్రేమ ఎక్కడా లభించలేదన్నారు. వేరే పార్టీలు రూ.కోట్లు పంచినా తాను ఒక్క రూపాయి ఇవ్వలేదని, అయినా తానే గెలుస్తానన్నారు. దేశంలోనే మోస్ట్ కమర్షియల్ బైపోల్ఇదన్నారు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తనపై దాడి చేశారని, పక్కనే ఉన్న ఎస్పీ రెమా రాజేశ్వరి పట్టించుకోకుండా ఎంకరేజ్ చేశారని, ఆ దశలో ఎన్కౌంటర్ చేయిస్తారేమోనని భయపడ్డానన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్‌తో కొట్టించేందుకు ప్రయత్నించారని, ఈ ఎన్నికలో తనపై మూడు సార్లు దాడి జరిగిందన్నారు. ఈవీఎం టాంపరింగ్ జరగకపోతే కనీసం 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానన్నారు.
కేఏ పాల్ సీఎం, సీఎం అంటూ స్లోగన్ చేస్తుంటే ఎస్పీ హడలిపోయారన్నారు. ప్రపంచంలోని ఎందరో నియంతలను చూశానని, కేసీఅర్ లాంటి వారిని మాత్రం చూడలేదన్నారు. కేసీఅర్ రూ.ఐదు లక్షల కోట్ల అప్పులు చేశాడని...ఆయనేమైనా కేఏ పాల్ అనుకుంటున్నాడా? అని ఎద్దేశా చేశారు. తనకు, అమిత్ షాకు మధ్య ఘర్షణ జరిగిందని, తనను ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఆయన చెప్పారన్నారు. ‘సేవ్ ఇండియా ఫ్రమ్ మోడీ’ పేరుతో బుక్ రాశానన్నారు. గురువారం ఉపఎన్నిక జరిగితే ఆదివారం కౌంటింగ్ చేయడం ఏంటన్నారు. కోర్టు చెప్పినా తనకు ఎందుకు సెక్యూరిటీ, గన్ మెన్లను ఇవ్వట్లేదని అడిగారు. ఈవీఎంలను మ్యానుప్యులేట్, రీప్లేస్ చేస్తున్నారని ఆరోపించారు. డాన్‌బాస్కో కాలేజీ నుంచి 200 ఖాళీ ఈవీఎంలు తరలిస్తున్నారని, ఆ ట్రక్ మాయమైందన్నారు. సీఎం అయి రాష్ర్టం పై ఉన్న రూ.5లక్షల అప్పు తీర్చి బంగారు తెలంగాణ అంటే ఏమిటో చూపిస్తానన్నారు. మునుగోడు లాంటి అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. మీడియా సమావేశంలో కేసీఆర్పక్కన అమ్ముడుపోయేందుకు బేరాలు చేసుకున్న ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకున్నారని, బేరసారాలు రికార్డు చేయించిందే కేసీఆర్ అని అన్నారు. ప్రపంచ దేశాలన్ని తనను గౌరవిస్తుంటే కేసీఆర్ మాత్రం క్రిమినల్‌గా చూస్తున్నారని ఆరోపించారు.