మునుగోడులో రూల్స్ బేఖాతర్: కోదండరాం

బైపోల్​ పూర్తయ్యాక కోర్టుకు వెళ్తం

హైదరాబాద్, వెలుగు:మునుగోడు ఎన్నికల ప్రచారంలో యథేచ్ఛగా రూల్స్ ఉల్లంఘిస్తుంటే ఈసీ చోద్యం చూస్తోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ప్రజాస్వామ్యం నవ్వుల పాలయిందన్నారు. రూల్స్ ఉల్లంఘన పై ఇప్పటికి ఈసీకి నాలుగు సార్లు ఫిర్యాదు చేశామని, ఎన్నికల పక్రియపై ఈసీ ఆఫీస్ లో నిరసన తెలిపామని గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, మద్యం ఏరులై పారుతోందన్నారు. 17 ఏండ్ల పిల్లలకు కూడా మందు పోస్తున్నారని, వాళ్ల భవిష్యత్ ఏంగావాలని ప్రశ్నించారు.

స్వయంగా రాష్ట్ర మంత్రి మందు పార్టీలో పాల్గొన్నట్టు వీడియోలు, ఫొటోలు వచ్చాయని, ఇంత జరుగుతున్నా ఈసీ పట్టించుకోవటం లేదన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం మంత్రులు ఎస్కార్ట్ లో, ప్రభుత్వ వెహికిల్స్ లో పర్యటించరాదన్నారు. చౌటుప్పల్ లో మంత్రి కేటీఆర్ నేషనల్ హైవేని బ్లాక్ చేసి రోడ్ షో నిర్వహించారని కోదండరాం తెలిపారు. ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు కలిసి రూ.600 కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరుగుతోందన్నారు. మునుగోడు ప్రచారం, రూల్స్ ఉల్లంఘనపై కోర్టులు జోక్యం చేసుకోవాలని కోదండరాం కోరారు. తాము కోర్టులో పిటిషన్ వేయాలనుకున్నామని, అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతున్నందున కోర్టులు జోక్యం చేసుకోవని ఆయన తెలిపారు. ఉప ఎన్నిక పూర్తయిన తరువాత మునుగోడుపై హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఈసీ అధికారులు ప్రభుత్వంను కాదని పనిచేయలేరని అన్నారు. మునుగోడు బై పోల్ తో ఈసీ అపవాదు మూటగట్టుకుందని విమర్శించారు.