నెల్లికుదురు, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారెంటీలు పక్కా అమలు చేస్తామని మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ అన్నారు. మంగళవారం నెల్లికుదురు మండలంలోని సీతారాంపురం, రత్తిరాం తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే రోజు వచ్చిందన్నారు. మహబూబాబాద్ లో గత పదేండ్లలో చేయని అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తానని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతి కార్యకర్త ఈ 10 రోజులు కష్టపడి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. గిరిజన తండాల దుస్థితి చూస్తుంటే బాధ కలుగుతుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. ఆదరించి ఒక్క అవకాశం ఇస్తే మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఐదేళ్లు సేవ చేస్తానని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, బాలాజీ, లక్ష్మారెడ్డి, యాదవ రెడ్డి, సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : నిర్మలమ్మే ఒప్పుకుంది.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తరు : హరీష్ రావు