నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని మహబూబాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ మురళీనాయక్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం, కల్వల, గాంధీపురం గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీనాయక్ మాట్లాడుతూ తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, గ్రామాల్లో సరైన రోడ్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ ఇప్పుడు దొరల తెలంగాణగా మారిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజల తెలంగాణగా మారుతుందన్నారు. తనను గెలిపిస్తే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, గంట సంజీవరెడ్డి, బట్టు శ్రీను, సమ్మి గౌడ్, దామరకొండ ప్రవీణ్ పాల్గొన్నారు.